Begin typing your search above and press return to search.

డ్యాషింగ్ హీరో సినిమాల‌కు గుడ్ బాయ్..!

By:  Tupaki Desk   |   31 Aug 2021 10:58 AM IST
డ్యాషింగ్ హీరో సినిమాల‌కు గుడ్ బాయ్..!
X
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ సేవ‌లు అన‌న్య‌సామాన్యం. న‌టుడిగా..నిర్మాత‌గా.. ద‌ర్శ‌కుడిగా వెండి తెర‌పై ఆరుద‌శాబ్ధాల సుదీర్ఘ‌ ప్ర‌స్థానం ఆయ‌న‌కే సాధ్యం. తెలుగు సినిమాకు అధునాత‌న‌ సాంకేతిక‌త‌ను ప‌రిచయం చేసిన ఘ‌నత సూప‌ర్ స్టార్ కే చెల్లింది. మూస‌ధోర‌ణిలో వెళుతున్న తెలుగు సినిమాని న‌వ్య పంథాలో న‌డిపించిన దార్శ‌నికుడైన హీరో కం నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు. అన్నింటికి మించి డేరింగ్ అండ్ డ్యాషింగ్ న‌టుడిగా సూప‌ర్ స్టార్ ఓ వెలుగు వెలిగారు. వెండితెర‌పై ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగం లేదు. స‌క్సెస్..ఫెయిల్యూర్ సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి ప్ర‌య‌త్న‌లోపం లేకుండా ముందుకు వెళ్లిన ఏకైక లెజెండ్ ఆయ‌న‌. అందుకే సూప‌ర్ స్టార్ ని అంతా డ్యాషింగ్ హీరోగా పిలుచుకుంటారు.

నాటి త‌రం స‌మ‌కాలీకుల నుంచి నేటి మేటి హీరోల వ‌ర‌కూ ఎంతో మందితో సూప‌ర్ స్టార్ కృష్ణ క‌లిసి ప‌నిచేసారు. న‌వ‌త‌రం క‌థానాయ‌కుల చిత్రాల్లో సైతం కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ న‌ట‌న‌పై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకునేవారు. సూప‌ర్ స్టార్ అభిమానులు ఆయ‌న‌ను తెర‌పై చూసేందుకు ఎంతో సంతోష‌ప‌డేవారు. ఇప్పుడు వాళ్లంద‌రికీ సూప‌ర్ స్టార్ నుంచి చేదు వార్త అందింది. ఆరు ద‌శ‌బ్ధాల న‌ట ప్ర‌స్థానాన్ని ముగిస్తూ సినిమాల‌కు సూప‌ర్ స్టార్ అధికారికంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. ఇక వెండి తెర‌పై త‌న‌ని చూడ‌లేర‌ని చెప్ప‌క‌నే చెప్పేసారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ...

నా కెరీర్ ప‌ట్ల చాలా సంతోషంగా ఉన్నాను. రిటైర్మెంట్ ఇచ్చాన‌న్న బాధ నాలో లేదు. చేసినంత కాలం సినిమా రంగంలో ప‌నిచేసాను. అదే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. భ‌విష్య‌త్ లో ఎలాంటి అతిథి పాత్ర‌ల్లోగానీ.. ముఖ్య‌మైన పాత్ర‌ల్లో గాని న‌టించ‌బోన‌ని తెలిపారు. ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టించొద్ద‌ని నా అభిమానులు అప్ప‌ట్లోనే లేఖ‌లు రాసారు. ఎన్నో అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. కానీ అలాగైనా క‌నిపించ‌క‌పోతే అభిమానులు న‌న్ను చూసుకోలేర‌ని న‌టించా. ఇప్పుడు ఆ అవ‌కాశం లేదు. వెండి తెర న‌ట‌న‌ను విర‌మించాను అని వెల్ల‌డించారు.

కృష్ణ చివ‌రి సారిగా `శ్రీశ్రీ` సినిమాలో న‌టించారు. అది 2016లో విడుద‌లైంది. ఆ త‌ర్వాత ఆయ‌న ఎలాంటి సినిమాలు చేయ‌లేదు. ఆయ‌న వ‌య‌సు దృష్ట్యా ప్ర‌స్తుతం నాన‌క్ రామ్ గూడ లోని స్వ‌గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ ఇలా నేరుగా రిటైర్మెంట్ వార్త‌ని అభిమానుల‌తో పంచుకున్నారు.