Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలకు దాసరి గట్టిగా ఇచ్చాడు

By:  Tupaki Desk   |   6 Jun 2016 9:17 AM GMT
స్టార్ హీరోలకు దాసరి గట్టిగా ఇచ్చాడు
X
తెలుగు సినిమాలు ఒకప్పుడు హాఫ్ సెంచరీలు.. సెంచరీలు కొట్టేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద హిట్టు సినిమా అయినా రెండు మూడు వారాలకు మించి ఆడట్లేదు. ఒకేసారి వేల థియేటర్లలో రిలీజ్ చేసి.. అదనపు షోలు వేసి ఓపెనింగ్స్ దండుకోవడం మీదే ఇప్పుడు అందరూ దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఈ పద్ధతి బాగా కనిపిస్తోంది. ఈ ఓపెనింగ్స్ కోసమని.. సినిమాకు లేని పోని హైప్ తీసుకురావడం.. అంచనాలు భారీగా పెంచేయడం.. జరుగుతోంది. ఐతే హైప్ కు తగ్గట్లుగా సినిమాలు లేకపోతుండటంతో.. దారుణమైన ఫలితాలు వస్తున్నాయి. ఈ దుష్పరిణామం మీద ఎవ్వరూ మాట్లాడని టైంలో దర్శక రత్న దాసరి నారాయణరావు స్పందించారు.

పెద్ద సినిమాల విడుదలకు ముందు ఆడియో ఫంక్షన్లని.. టీజర్లని.. ట్రైలర్లని.. మేకింగ్ వీడియోలని హడావుడి చేసి.. ప్రేక్షకుల్ని బాగా ఊరించి.. గొప్ప గొప్ప మాటలు చెప్పి అంచనాలు పెంచేస్తున్నారని.. తీరా విడుదల తర్వాత చూస్తే సినిమాలు అంత గొప్పగా ఉండట్లేదని.. అంచనాలు అందుకోలేక చాలా సినిమాలు ఫ్లాపవుతున్నాయని.. చివరికి హీరోలు తిరిగి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడియో ఫంక్షన్లు.. ప్రమోషన్లు చిన్న సినిమాలకు మాత్రమే అవసరమని.. ఆ సినిమాల గురించి జనాలకు తెలియదు కాబట్టి ఇవన్నీ అవసరమని.. కానీ స్టార్ హీరోల సినిమాలకు ఇవేమీ పని లేదని ఆయనన్నారు. ప్రమోషన్లు.. ఫంక్షన్ల హడావుడి లేకుండా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించే సత్తా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మరి దాసరి ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారా..? సినిమాలకు లేని పోని హైప్ తీసుకొచ్చే పద్ధతి మానేస్తారా?