Begin typing your search above and press return to search.

బాహుబ‌లి కంటే పెళ్లి చూపులే బెట‌రన్న దాసరి

By:  Tupaki Desk   |   4 Aug 2016 8:15 AM GMT
బాహుబ‌లి కంటే పెళ్లి చూపులే బెట‌రన్న దాసరి
X
ఒక మంచి ఫీల్ ఉన్న చిత్రంగా పెళ్లి చూపులు మార్కులు కొట్టేసింది. ఎలాంటి హ‌డావుడి లేకుండా విడుద‌లైన ఈ చిత్రం మౌత్ టాక్‌ తోనే హిట్ అయింది. విమ‌ర్శ‌కులూ ప్రేక్ష‌కులూ అంద‌రూ ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను కూడా ఈ చిన్న చిత్రం విశేషంగా ఆక‌ట్టుకుంది. సినిమా చూసిన ప్ర‌ముఖులంతా సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. పెళ్లి చూపులు టీమ్‌ ని మెచ్చుకుంటున్నారు. అతి త‌క్కువ బ‌డ్జెట్‌ లో నిర్మించిన ఈ చిత్రం నిర్మాత‌ల‌కు బాగానే లాభాలు ఆర్జించి పెడుతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నారు. రూ. 1 కోటి లోపు వ్యయం తో రూపొందిన ఈ చిత్రం రూ. 10 కోట్ల వ‌ర‌కూ క‌లెక్ట్ చేస్తుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. క‌థ పాత‌దే అయినా - రొటీన్ మాస్ మ‌సాలా ఫార్ములాలు ఏవీ లేకుండా సెన్సిబుల్ క‌థాంశంతో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు కూడా స్పందించారు.

‘బాహుబ‌లి - పెళ్లి చూపులు ఈ రెండింటిలో మీ ఓటు దేని అని ఎవ‌రైనా న‌న్ను అడిగితే, నా ఓటు క‌చ్చితంగా పెళ్లి చూపుల‌కే వ‌స్తాను’ అని చెప్పారు ద‌ర్శ‌క‌ర‌త్న‌. ఆ చిత్రం రూపొందించిన బ‌డ్జెట్ ఎంత‌..? తెచ్చిపెడుతున్న లాభాల శాతం ఎంత‌...? ఇలాంటివి త‌న లెక్క‌ల‌ని దాస‌రి చెప్పారు. ఒక సినిమా విజ‌యం సాధించ‌డానికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలన్నీ ఆ చిత్రానికి ఉన్నాయంటూ దాస‌రి మెచ్చుకున్నారు. పెళ్లి చూపులు లాంటి మ‌రిన్ని చిత్రాలు తెలుగు ప‌రిశ్ర‌మ‌లో రావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. సృజ‌నాత్మ‌క‌త ఉన్న చిత్రాల సంఖ్య‌ మ‌న ప‌రిశ్ర‌మ‌లో పెర‌గాల‌న్నారు. ఇప్ప‌టికే త‌మిళ‌ - మ‌ల‌యాళ‌ - హిందీ భాష‌ల్లో ఇలాంటి చిన్న చిత్రాలు మంచి విజ‌యం సాధిస్తున్నాయ‌నీ, మ‌న ద‌గ్గ‌ర కూడా వీటి సంఖ్య పెరిగితే దేశ‌వ్యాప్తంగా టాలీవుడ్ చిత్రాల‌కు కూడా ప్రాధాన్య‌త పెరుగుతుంద‌ని దాస‌రి చెప్పారు. మొత్తానికి... బాహుబ‌లి కంటే ఇదే మిన్న అని దాస‌రి ప్ర‌శంసించారంటే - పెళ్లి చూపులు యూనిట్‌ కి అంత‌కంటే మించిన అవార్డు ఏముంటుంది చెప్పండి..?