Begin typing your search above and press return to search.

సౌండ్ బాక్సు మోస్తూ కొండల మీద వెంకీ

By:  Tupaki Desk   |   25 July 2016 4:56 AM GMT
సౌండ్ బాక్సు మోస్తూ కొండల మీద వెంకీ
X
విక్టరీ వెంకటేష్ లాంటి హీరోను తాను ఎక్కడా చూడలేదని అంటున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. నిర్మాత కొడుగ్గా ఇండస్ట్రీకి పరిచయమై.. స్టార్ హీరోగా ఎదిగి..30 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదన్నారు దాసరి. ‘బాబు బంగారం’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ వెంకీని ఆకాశానికెత్తేశారు. వెంకీతో తన అనుబంధం గుర్తుచేసుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘ఇప్పుడందరూ వెంకటేష్ ను బాబు బంగారం అంటున్నారు. కానీ నేనా మాట 30 ఏళ్ల కిందటే చెప్పాను. 30 ఏళ్లుగా ఏ ఒక్క నిర్మాత తోటి ఒక కామెంట్ తీసుకోకుండా.. ఒక విమర్శ రాకుండా కొనసాగడం అన్నది మామూలు విషయం కాదు. రామానాయుడి ఆశీస్సుల వల్లే వెంకీ ఇలా ఉండగలుగుతున్నాడు. వారి కుటుంబంతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఒక నిర్మాత కుమారుడు స్టార్ హీరోగా ఇంత సుదీర్ఘ కాలం కొనసాగడం ఏ ఇండస్ట్రీలో చూసినా ఒక్క వెంకటేష్ విషయంలోనే జరిగింది. వెంకీని అందరూ తెరమీదే చూసి ఉంటారు. తెర వెనుక అతను వేరే మనిషి. అతను నిర్మాతల కష్టసుఖాలు తెలిసిన నిజమైన హీరో.

బ్రహ్మపుత్రుడు షూటింగ్ కాశ్మీర్లో చేసినపుడు.. సౌండ్ బాక్స్ మోసుకుంటూ కొండలమీదికి ఎక్కడం చూశాను. ఇలా చేసిన ఏకైక హీరో అతనే. ఉత్సాహం.. ప్రయత్నం.. నిబద్ధత.. ఈ మూడూ కలిస్తే వెంకీ. అతడి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. వెంకీ ఎప్పుడూ కథను బట్టి నటించాడు తప్ప సంస్థను బట్టి కాదు. అందుకే ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించాడు. ఉత్తమ నటుడిగా ఎక్కువ నంది అవార్డులు పొందింది వెంకటేష్ బాబే. వెంకటేష్ హీరోగా నిలబడ్డం వెనుక నిజమైన హీరో సురేష్. ఇక దర్శకుడు మారుతి తన తొలి సినిమాను విడుదల చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. కానీ ఆ తర్వాత తనకంటూ ఒక బ్రాండ్ వచ్చేలా చేసుకున్నాడు. ఇప్పుడు ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేశాడు. అతను కచ్చితంగా స్టార్ డైరెక్టర్ అవుతాడు’’ అని దాసరి అన్నారు.