Begin typing your search above and press return to search.

దాసరి చివరి మెరుపు అదే..

By:  Tupaki Desk   |   31 May 2017 11:35 AM IST
దాసరి చివరి మెరుపు అదే..
X
ఒక తాత మనవడు.. ప్రేమాభిషేకం.. ఒక బెబ్బులి పులి.. ఒక తాండ్ర పాపారాయుడు.. ఇలా దాసరి దర్శక ప్రస్థానంలో ఎన్నెన్ని మెగా హిట్లో. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే రజతోత్సవ సినిమాను అందించిన దాసరి నారాయణరావు.. ఆ తర్వాత మరెన్నో అసాధారణ విజయాలను అందుకున్నారు. ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో 151 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. అందులో అత్యధిక శాతం హిట్లు అందుకున్న ఘనతా దాసరిదే.

ఐతే చివరి దశలో మాత్రం దాసరి తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోయారు. ఆయన దర్శకత్వంలో చివరి మెరుపు అంటే.. ‘ఒసేయ్ రాములమ్మ’ అనే చెప్పాలి. 1997లో వచ్చిన ఈ సినిమా అసాధారణ విజయం సాధించింది. అంతకుముందు దాసరి తీసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమా మీద పెద్దగా అంచనాల్లేవు. పైగా విజయశాంతిని ప్రధాన పాత్రలో పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయడమేంటని చాలామంది తేలిగ్గా మాట్లాడారు. కానీ ‘ఒసేయ్ రాములమ్మ’ సాధించిన విజయం చూసి మొత్తం సినీ పరిశ్రమ విస్తుబోయింది. తెలుగులోనే కాదు.. దేశం మొత్తంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ‘ఒసేయ్ రాములమ్మ’ ఒక చరిత్ర అయింది. అప్పటి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఐతే ఇదే కోవలో దాసరి ఆ తర్వాత ‘రౌడీ దర్బార్’ తీశారు. అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత దాసరి తీసిన ఏ సినిమా కూడా ఆడలేదు. ‘ఫూల్స్’ అనే సినిమా తీవ్రంగా నిరాశ పరచగా.. ఆ తర్వాత దాసరి చాలా కాలం పాటు మెగా ఫోన్ పట్టలేదు.

ఇక ఆయన మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లరేమో అనుకుంటుండగా.. నందమూరి బాలకృష్ణ హీరోగా తన 150వ సినిమాగా ‘పరమవీర చక్ర’ తీశారు. అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ దాసరి విరామం తీసుకున్నారు. ఆపై తమిళంలో విజయవంతమైన ఓ సినిమా నచ్చి.. ముంచు విష్ణుతో ‘ఎర్రబస్సు’ తీశారు. ఆ చిత్రంలో దాసరి ముఖ్య పాత్ర కూడా పోషించారు. దర్శకుడిగా.. నటుడిగా దాసరికి అదే చివరి సినిమా. కానీ అది కూడా ఆయనకు నిరాశనే మిగిల్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/