Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కోసం క‌థ రాయ‌మ‌న్నారట!

By:  Tupaki Desk   |   1 Sept 2015 11:43 AM IST
ప‌వ‌న్ కోసం క‌థ రాయ‌మ‌న్నారట!
X
దాస‌రి నారాయ‌ణ‌రావు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ అంటే నిస్సందేహంగా అదొక సంచ‌ల‌న‌మే. దాసరి నిర్మాణంలో న‌టించేందుకు ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఎప్పుడో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఆ విష‌యం తెలిసిన‌ప్ప‌ట్నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ సినిమా వ‌స్తుందా అన్న‌ట్టుగా చ‌ర్చించుకోవ‌డం క‌నిపిస్తోంది. అరుదైన కాంబినేష‌న్ సెట్ట‌యింది కాబ‌ట్టి దాస‌రి కూడా అందుకు ధీటైన క‌థ‌తో సినిమా తీయాల‌నుకొంటున్నాడు. ఆ మేర‌కు ఎప్ప‌ట్నుంచో క‌థ‌ల గురించి అన్వేషిస్తున్నాడు. ఆ కథే ఎంత‌కీ దొర‌క‌డం లేదు. త‌న కాంపౌండ్‌ లో ఉన్న ద‌ర్శ‌కులంద‌రితోనూ ప‌వ‌న్ కోసం క‌థ రాయిస్తున్నాడు దాస‌రి. అయినా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ మాత్రం క‌థ ఎప్పుడు ఓకే అనుకొంటే అప్పుడు వ‌చ్చేస్తా అంటున్నాడట‌. ఇటీవ‌ల క‌థల కోసం దాస‌రి మ‌రిన్ని క‌స‌ర‌త్తులు మొద‌లెట్టాడ‌ని స‌మాచారం. `శ్రీమంతుడు`తో హిట్టు కొట్టిన కొర‌టాల శివ‌కి దాసరి నారాయ‌ణ‌రావు క‌బురు పెట్టాడ‌ట. ప‌వ‌న్‌ని దృష్టిలో ఉంచుకొని ఓ క‌థ రాయొచ్చుగా అని అడిగార‌ట‌. ఆయ‌న కూడా రాస్తాన‌ని చెప్పి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

కొర‌టాల శివ చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. బ‌న్నీ కోసం ఒక‌టి, ఎన్టీఆర్ కోసం మ‌రో క‌థ‌ని సిద్ధం చేసుకొన్నాడ‌ని తెలుస్తోంది. అయితే వాళ్లిద్ద‌రూ ఇప్పుడు త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. సో... కొర‌టాల శివ ఇంకా ఏడెమిది నెల‌లు ఆగాల్సిందే. ప్ర‌త్యామ్నాయం గురించి ఆలోచిస్తున్న ద‌శ‌లో దాస‌రి నుంచి క‌బురొచ్చిందాయ‌న‌కి. ప‌వ‌న్‌ కోసం క‌థ రాసి ఈ స‌మ‌యాన్ని సద్వినియోగం చేసుకొందామ‌న్న ఆలోచ‌న‌లో కొర‌టాల ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొర‌టాల క‌థ‌ని సిద్ధం చేయిస్తే మ‌రి దాస‌రి ఎవ‌రి చేతిలో పెడ‌తార‌న్న‌ది చూడాలి. ప‌వ‌న్ ఇప్ప‌టికే డాలీతో మ‌రో సినిమా చేస్తాన‌ని చెప్పారు. దాస‌రికి కూడా డాలీ ద‌ర్శ‌కత్వానికి ఓకే చెబుతున్నాడు. కాబ‌ట్టి మంచి క‌థ కుదిరితే డాలీ ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమా తెర‌కెక్కనున్న‌ట్టు తెలుస్తోంది.