Begin typing your search above and press return to search.

దాస‌రి చెప్పిన ఆ సంచ‌లన పుస్త‌కం ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   2 Jun 2017 8:02 PM IST
దాస‌రి చెప్పిన ఆ సంచ‌లన పుస్త‌కం ఎక్క‌డ‌?
X
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించే ద‌ర్శ‌కర‌త్న దాస‌రి శాశ్విత నిద్ర‌లోకి జారిపోవ‌టం తెలిసిందే. ఆయ‌న లేని చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఊహించుకోవ‌టానికి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అనారోగ్యంతో క‌న్నుమూసిన ఆయ‌న లేని లోటు ఎవ‌రూ పూడ్చ‌లేర‌న్న‌ది నిజం. చిన్న చిత్రాల‌కు పెద్ద అండ‌గా నిలిచిన ఆయ‌న‌.. .ఇక‌పై ఆయ‌న పాత్ర‌ను తీసుకునేవారు ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌టం లేదు.

దాస‌రి మ‌ర‌ణంతో తండ్రీ.. త‌ల్లిని ఒకేసారి కోల్పోయిన‌ట్లుగా ఉందంటూ కొంద‌రు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు వ్యాఖ్యానించ‌టం చూస్తే.. టాలీవుడ్ లో దాస‌రి రోల్ ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. దాస‌రి లేని వేళ‌.. ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు అంశాలు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి.

కొద్దికాలం కింద‌ట ప‌సుపులేటి రామారావు రాసిన వెండితెర అరుణ కిరణం టి.కృష్ణ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో మాట్లాడిన దాస‌రి.. తాను ఒక పుస్త‌కం రాస్తున్న‌ట్లుగా చెప్పి పెద్ద బాంబే పేల్చారు. ఎందుకంటే.. ఈ పుస్త‌కంలోని విష‌యాల్ని చూచాయ‌గా చెప్పి.. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌న చ‌ర్చ‌కు తెర తీశారు. తాను రాసే పుస్త‌కంలో పెద్ద మ‌నుషులుగా చెప్పుకునే వారికి సంబంధించిన అస‌లు విష‌యాలు ఉంటాయ‌ని.. వారికి సంబంధించి బ‌య‌ట‌కు రాని నిజాల్ని తాను చెప్ప‌నున్న‌ట్లుగా చెప్పారు.

ప‌రిశ్ర‌మ‌లో గొప్ప‌వారిగా చెప్పుకునే వారి గుట్టు ర‌ట్టు చేస్తాన‌ని ఆయ‌న చెప్ప‌టం అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చే న‌డిచింది. మూడేళ్లుగా తాను పుస్త‌కం రాస్తున్నాన‌ని.. మొత్తం పూర్తి కావ‌టానికి మ‌రో ఏడాదిన్న‌ర ప‌డుతుంద‌ని అప్ప‌ట్లో చెప్పారు దాస‌రి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ పుస్త‌కం సంగ‌తేమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. తాను రాస్తున్న పుస్త‌కం గురించి చెబుతూ.. ఎన్టీఆర్‌ ను ప‌రిచ‌యం చేసింది ఎవ‌రంటే ఎల్వీ ప్ర‌సాద్ అని చెబుతార‌ని.. అలాంటి అబ‌ద్ధాలే ప్ర‌చారంలో ఉన్నాయ‌ని.. కొంత‌కాలం గ‌డిచాక తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లోనే స్టార్ట్ అయ్యింద‌న్న ఆశ్చ‌ర్యం లేద‌న్నారు. అందుకే.. అస‌లు నిజాల్ని చెప్పాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని.. అందుకే తాను పుస్త‌కం రాస్తున్న‌ట్లు చెప్పారు.

ఇండ‌స్ట్రీలో పెద్ద‌మ‌నుషులుగా చెలామ‌ణి అయ్యే వారి గుట్టుమ‌ట్ట‌ను బ‌య‌ట‌కు తెస్తాన‌ని చెప్పిన దాస‌రి మాట‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యాయి. ఆయ‌న పుస్త‌కంలో ఏం ఉంటాయ‌న్న ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. తాజాగా ఆయ‌న మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఆయ‌న రాసిన పుస్త‌కం బ‌య‌ట‌కు వ‌స్తుందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న రాసిన పుస్త‌కం తాలూకూ ఒరిజిన‌ల్స్ ఎవ‌రికి ద‌గ్గ‌ర ఉన్నాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. నిజాల్ని నిర్భ‌యంగా బ‌య‌ట‌పెట్టాల‌ని ఆశ‌ప‌డ్డ దాస‌రి ఆశ‌ల్ని ఆయ‌న వార‌సులు తీరుస్తారా? అన్న‌దే ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/