Begin typing your search above and press return to search.

ఆ నాటకం దాసరి చూడకపోయుంటే.. ఓ విలక్షణ నటున్ని మిస్ అయ్యేవాళ్ళం!

By:  Tupaki Desk   |   8 Sep 2020 11:50 AM GMT
ఆ నాటకం దాసరి చూడకపోయుంటే.. ఓ విలక్షణ నటున్ని మిస్ అయ్యేవాళ్ళం!
X
కర్నూలు జిల్లా సిరివెళ్లకు చెందిన జయప్రకాశ్ రెడ్డి పోలీసు శాఖలో పని చేస్తున్నా ఆయన మనసంతా..రంగస్థలంపైనే ఉండేది. కాస్త సమయం దొరికితే చాలు నాటకాల్లో పాత్ర లు వేసేవాడు. సినీ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు, సంపద ఆయనలోని నటుడిని సంతృప్తి పరచలేదు. ఆర్టిస్ట్ గా ఎంత బిజీగా ఉన్నా తెలుగు రాష్ట్రాలంతా తిరిగి వందల సంఖ్యలో నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. వయసు 70 దాటినా ఏ రోజు నాటక రంగాన్ని వదల్లేదు. వరుసగా తన ప్రదర్శనలతో కనుమరుగు అవుతున్న నాటక రంగానికి జీవం పోశాడు. ఆ నాటకాలు నమ్ముకున్నాడు కాబట్టే నేమో.. సినిమాల్లో ప్రవేశానికి ఓ దారిలా నిలిచాయి.

నల్గొండలో జరిగిన ఓ పత్రిక ప్రారంభోత్సవంలో నాటకాన్ని ప్రదర్శించేందుకు నిర్వాహకులు జయప్రకాశ్ రెడ్డిని ఆహ్వానించారు. అప్పటికింకా ఆయన పోలీసు డిపార్టుమెంటులోనే పని చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ చివర్లో జయప్రకాశ్ రెడ్డి నాటకం నాటకం వేయాల్సి ఉంది. దాసరి గారు చివరి వరకూ వుంటారో లేదోనని జయప్రకాశ్ రెడ్డి కి సందేహం వచ్చింది. కనీసం ఓ 15 నిముషాలైనా నాటకం చూసి వెళ్లాలని దాసరిని కలసి విన్నవించాడు. జయప్రకాశ్ రెడ్డి నటన, డైలాగ్ డెలివరీ దాసరి గారికి బాగా నచ్చింది. ఆ తర్వాత 1988 లో తాను తీసిన ' బ్రహ్మ పుత్రుడు ' సినిమాలో దాసరి జయప్రకాశ్ రెడ్డికి అవకాశం కల్పించారు. దాసరి గారు ఆ నాటకం చూడకపోయుంటే ఒక విలక్షణ నటుడిని ఇండస్ట్రీ కోల్పోయేది.