Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘దర్శకుడు’

By:  Tupaki Desk   |   5 Aug 2017 9:54 AM GMT
మూవీ రివ్యూ: ‘దర్శకుడు’
X
చిత్రం : ‘దర్శకుడు’

నటీనటులు: అశోక్ - ఈషా రెబ్బా - పూజిత - సుదర్శన్ - నోయల్ - జెమిని సురేష్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: ప్రవీణ్ అనుమోలు
నిర్మాతలు: విజయ్ కుమార్ - థామస్ రెడ్డి - రవిచంద్ర
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: జక్కా హరిప్రసాద్

దర్శకుడిగానే కాక నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు సుకుమార్. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన తొలి సినిమా ‘కుమారి 21 ఎఫ్’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు తన అన్న కొడుకు అశోక్ ను కథానాయకుడిగా.. తన మిత్రుడు జక్కా హరి ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘దర్శకుడు’ సినిమాను నిర్మించాడు. మరి ఈసారి సుక్కు అండ్ టీం ఎలాంటి సినిమాను అందించిందో చూద్దాం పదండి.

కథ:

మహేష్ (అశోక్)కు దర్శకుడిగా మారాలన్నది కల. ఐతే అతను దర్శకుడిగా మారడం కోసం ఓ కథ రాసి నిర్మాతకు వినిపిస్తే.. ఆ కథలో అన్నీ ఉన్నా రొమాన్స్ మిస్సయిందంటాడు. నిజంగా ఓ అమ్మాయిని ప్రేమించలేదు కాబట్టే నీకు రొమాంటిక్ ఆలోచనలు రావట్లేదని.. ఆ ట్రాక్ వరకు పక్కాగా సెట్ అయితే సినిమా మొదలుపెట్టేద్దామని అంటాడు నిర్మాత. దీంతో మహేష్ ఆ ప్రయత్నంలో ఉంటాడు. అప్పుడే అతడికి ఓ ప్రయాణంలో అనుకోకుండా నమ్రత (ఈషా) పరిచయమవుతుంది. ఈ ప్రయాణంలోనే మహేష్ పట్ల నమ్రత ఆకర్షితురాలవుతుంది. ఐతే నమ్రత ప్రేమను ఫీలవ్వకుండా తన ఎమోషన్లను కూడా సినిమా కోసం ఉపయోగించుకోవాలని చూస్తాడు మహేష్. దీంతో అతణ్ని ఛీకొట్టి వెళ్లిపోతుందామె. మరి ఆ తర్వాత మహేష్ ప్రయాణం ఎలా సాగింది.. దర్శకుడు కావాలన్న అతడి కల నెరవేరిందా.. నమ్రతతో అతడి ప్రేమ మాటేంటి.. అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

సినీ రంగంలో తెలుగులో సినిమాలు తెరకెక్కడం అరుదు. కానీ సినిమా వాళ్ల వ్యక్తిత్వాలు.. వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం జనాల్లో ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో వాస్తవికమైన సినిమాలు రావడం మరీ అరుదు. ఇంతకుముందు పూరి జగన్నాథ్ ‘నేనింతే’తో ఇలాంటి ఓ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సుకుమార్ మిత్రుడు హరి ప్రసాద్.. దర్శకుడు కావాలనుకునే కుర్రాళ్లలో ఉండే ప్యాషన్.. వాళ్ల ఆలోచన విధానం.. వారిలోని మానసిక సంఘర్షణను చూపిస్తూ ‘దర్శకుడు’ సినిమా తీశాడు. దర్శకుడిగా ఎంతో అనుభవం ఉన్న వాళ్లు చేయాల్సిన సబ్జెక్టును.. దర్శకుడిగా తన తొలి సినిమాకు ఎంచుకోవడం సాహసమే. కానీ భిన్నమైన సబ్జెక్టును ఎంచుకుంటే సరిపోదు. దాన్ని సరిగ్గా తెరమీదికి తీసుకురావడం ముఖ్యం. ఆ విషయంలో ‘దర్శకుడు’ సంతృప్తిపరచలేకపోయాడు.

ఇక దర్శకుడు కావాలనే వ్యక్తి.. తన జీవితంలో ప్రతి అనుభవాన్నీ సినిమా కోణంలోనే చూస్తాడని.. అతడి జీవితమే సినిమా అని.. ప్రతి అంశాన్నీ సినిమా కోసం ఉపయోగించుకుంటాడని చూపించడం బాగుంది. ఇది నిజంగా కొత్తగా అనిపించే ఆలోచనే. ఇలాంటి లీడ్ క్యారెక్టర్లను మనం ఎప్పుడూ చూసి ఉండం కాబట్టి.. సినిమా కూడా కొత్తగానే అనిపిస్తుంది. కాకపోతే ఎంచుకున్న ప్లాట్ బాగున్నా.. హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తి రేకెత్తించి.. ఓ దశ వరకు ఈ ‘దర్శకుడు’తో ప్రయాణం సరదాగానే సాగిపోయినా.. కథ మలుపు తిరిగాక మాత్రం ఈ జర్నీ చాలా భారంగా అనిపిస్తుంది. ప్రేమకథలో ఫీల్ లేక.. కథ ముందుకు కదలకుండా స్ట్రక్ అయిపోయి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. మొదట్లో చాలా సహజంగా అనిపించే ఈ చిత్రం.. చివరికి వచ్చేసరికి ‘సినిమాటిగ్గా’ ముగుస్తుంది. అది మరింత నిరాశ కలిగించే విషయం.

ప్రథమార్ధంలో టిపికల్ హీరో క్యారెక్టరైజేషన్ వినోదం పంచితే.. హీరో హీరోయిన్ల ప్రేమ కథ కూడా బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఓ దశ వరకు సహజంగా సాగుతూ.. ఎంటర్టైనింగ్ గా.. ఎంగేజింగ్ గా అనిపించే ‘దర్శకుడు’.. ద్వితీయార్ధంలో మాత్రం సినిమాటిగ్గా సాగిపోతూ.. ముగింపు దశకు వచ్చేసరికి ఒక మామూలు సినిమాలా ముగుస్తుంది. ప్రేమకథలకు ఫీల్ అత్యంత ముఖ్యం. హీరో హీరోయిన్లు దూరమవుతుంటే.. ప్రేక్షకుడు బాధపడాలి. వాళ్ల ప్రేమ.. ఎడబాటు స్ట్రైకింగ్ గా అనిపించాలి. ‘దర్శకుడు’లో అదే మిస్సయింది. హీరో తన భావోద్వేగాలతో ఆడుకున్నాడని ఛీకొట్టి వెళ్లిపోతుంది కానీ.. మళ్లీ హీరో దగ్గరికే వస్తుంది. హీరోయిన్ విషయంలో తాను మరీ దారుణంగా ప్రవర్తించానన్న ఫీలింగ్ ఏ కోశానా లేకుండా హీరో చాలా మామూలుగా ఉంటాడు. చివరికి వచ్చేసరికి ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ ఉన్నట్లు చూపిస్తారు. బ్రేకప్ తర్వాత ఎడబాటు వల్ల కథ ఎమోషనల్ గా సాగుతుందనుకుంటే.. మళ్లీ హీరో హీరోయిన్లను ఒకచోటికే తీసుకొచ్చి పేలవమైన సన్నివేశాలతో.. ఎమోషన్ లేకుండా చేశారు. మొత్తానికి ‘దర్శకుడు’ ప్రామిసింగ్ గా మొదలై.. పేలవంగా ముగుస్తుంది. ప్లాట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం ‘దర్శకుడు’కు మైనస్ అయింది.

కొన్ని రకాల పాత్రలు అందరికీ సూటవ్వవు. కొన్ని పాత్రలకు ఓ స్టేచర్ అవసరమవుతుంది. ‘దర్శకుడు’లో హీరో పాత్ర అలాంటిదే. ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఇందులో ఏ నాని లాంటి నటుడో ఉంటో ఎలా ఉంటుందో అన్న ఆలోచన కొడుతూనే ఉంటుంది. నాని అనే కాదు కానీ.. రకరకాల భావోద్వేగాల్ని పలికిస్తూ.. మానసిక సంఘర్షణను కూడా చూపించే ఏ నటుడైనా దీనికి ఓకే అనిపించేది. తమ్ముడు తమ్ముడే.. అంటూ ఒక సామెత ఉంటుంది కదా. అలా సినిమా విషయానికి వచ్చేసరికి ఆ పాత్రకు న్యాయం చేసే నటుడెవరా అని చూసుకోవాల్సింది సుకుమార్ బృందం. పాత్రకు తగ్గ లుక్స్.. నటనా రెండూ లేని అశోక్ ‘దర్శకుడు’గా మెప్పించలేకపోయాడు. అది ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ అయింది. హీరో పాత్రతో చాలాసార్లు డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల కూడా ‘దర్శకుడు’ మనసుల్ని తాకదు.

నటీనటులు:

అశోక్ ‘దర్శకుడు’ పాత్రకు మిస్ ఫిట్ అని చెప్పడంలో మొహమాటం లేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే కీలక సన్నివేశం సహా చాలా సీన్లలో బ్లాంక్ ఫేస్ తో నిలబడిపోయాడు అశోక్. భిన్నమైన ఎమోషన్లను పలికించాల్సిన పాత్రలో అతను నిరాశ పరిచాడు. హీరోయిన్ ఈషా బాగా పెర్ఫామ్ చేయడం వల్ల అశోక్ మరింతగా తేలిపోయాడు. ఈషా ఆద్యంతం ఆకట్టుకుంది. సహజమైన నటన.. చక్కటి డైలాగ్ డెలివరీ ఆమె పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మరో హీరోయిన్ పూజిత పొన్నాడ పర్వాలేదు. ఆమె అందంగా ఉంది. సుదర్శన్ బాగా చేశాడు. జెమిని సురేష్ కూడా ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం:

సాయికార్తీక్ నేపథ్య సంగీతం ‘దర్శకుడు’లోని ఆకర్షణల్లో ఒకటి. మంచి ఫీల్ ఉన్న ఆర్.ఆర్ తో సన్నివేశాల్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు సాయికార్తీక్. పాటలు మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. చివర్లో వచ్చే ఎమోషనల్ సాంగ్ ఒకటి బాగుంది. ప్రవీణ్ అనుమోలు ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. దర్శకుడు హరిప్రసాద్ జక్కా.. రచయితగా మెప్పించాడు. దర్శకుడిగా మాత్రం విఫలమయ్యాడు. సినిమా మొదలైన తీరు చూస్తే హరి ప్రసాద్ కు ఇది తొలి సినిమాలా అనిపించదు. కానీ తర్వాత తర్వాత అతడి అనుభవ లేమి బయటపడుతుంది. తన కథకు తగ్గ హీరోను ఎంచుకోకపోవడం దర్శకుడి వైఫల్యమే. అలాగే ద్వితీయార్ధాన్ని సరిగా తీర్చిదిద్దుకోవడంలోనూ దర్శకుడు విఫలమయ్యాడు.

చివరగా: ఈ దర్శకుడి జర్నీ బోరింగ్!

రేటింగ్- 2.25/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre