Begin typing your search above and press return to search.

'బాండ్‌ గా నటించను'.. ఓ పిచ్చి అబద్ధం

By:  Tupaki Desk   |   17 Aug 2017 10:31 AM GMT
బాండ్‌ గా నటించను.. ఓ పిచ్చి అబద్ధం
X
మాటలు మార్చడంలో.. తూచ్ అనేయడంలో.. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో మన సెలబ్రెటీలే కాదు.. హాలీవుడ్ తారలు కూడా తక్కువోళ్లేమీ కాదనడానికి ఇది రుజువు. రెండేళ్ల కిందట జేమ్స్ బాండ్ సిరీస్‌ లో భాగంగా వచ్చిన కొత్త సినిమా ‘స్పెక్టర్’ విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో డేనియల్ క్రెయిగ్.. తాను ఇకపై జేమ్స్ బాండ్ పాత్ర చేసే సమస్యే లేదన్నాడు. బాండ్ క్యారెక్టర్ చేయడం కంటే నరకం మరొకటి లేదని.. అంత కష్టం ఇంకెందులోనూ ఉండదని.. ఎన్ని వందల కోట్లిచ్చినా ఇకపై బాండ్ పాత్ర చేయనని కుండబద్దలు కొట్టాడు. అబ్బో.. బాండ్ క్యారెక్టర్ అంటే అంత కష్టమా అంటూ జనాలు ఓ మాట్లాడేసుకున్నారు.

కట్ చేస్తే రెండేళ్లు గడిచాక ఇప్పుడు డేనియల్ క్రెయిగ్ మళ్లీ బాండ్ పాత్రకు రెడీ అయిపోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇదే విషయం అతణ్ని అడిగితే.. ఔను నిజమే అన్నాడు. బాండ్ క్యారెక్టర్ చేయడానికి ఇతణ్ని బలవంతంగా ఒప్పించారేమో అనుకున్నారు జనాలు. కానీ అప్పుడు బాండ్ పాత్ర చేయను అన్నారే అంటూ క్రెయిగ్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘అప్పుడేదో సరదాకు అన్నాను. అదో పిచ్చి అబద్ధం’’ అంటూ తేలిగ్గా మాట్లాడాడు. కానీ అప్పుడు క్రెయిగ్ బాండ్ పాత్రలో ఉన్న కష్టం గురించి.. తాను ఈ పాత్రకు టాటా చెప్పేయడం గురించి ఇంటెన్సిటీతో చెప్పాడో? కానీ ఇప్పుడు మాత్రం అదో పిచ్చి అబద్ధం అనడం ద్వారా అప్పుడు తన మాటల్ని నమ్మిన వాళ్లందరినీ పిచ్చోళ్లను చేసేశాడు. దీన్ని బట్టి చూస్తే అప్పుడు బాండ్ గారు చేసిందంతా జస్ట్ పబ్లిసిటీ స్టంటే అన్నమాట. జేమ్స్ బాండ్ సిరీస్ లో రాబోతున్న 25వ సినిమా.. ఈ ఏడాది చివర్లో ఆరంభం కాబోతోంది. 2019 నవంబరు 8న ఈ చిత్రం విడుదలవుతుంది.