Begin typing your search above and press return to search.

దండుపాళ్యం డైరెక్టర్ తో మహానుభావుడు

By:  Tupaki Desk   |   12 Dec 2017 4:17 AM GMT
దండుపాళ్యం డైరెక్టర్ తో మహానుభావుడు
X
ఈమధ్య కాలంలో క్రైం జోనర్ లో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులకు చాలా రోజుల పాటు గుర్తుండిపోయేది దండుపాళ్యం. లో బడ్జెట్ తో తీసిన కన్నడ సినిమా అయినా తెలుగులోనూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కర్ణాటక లోని ఓ గ్రామానికి చెందిన దొంగల ముఠా ఏరకంగా దోపిడీలు సాగించిందో డైరెక్టర్ శ్రీనివాసరాజు తెరకెక్కించిన తీరు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. దండుపాళ్యం ముఠాపై ఎంతో రీసెర్చ్ చేసి రియాలిటీకీ చాలా దగ్గరగా ఉండే విధంగా ఈ సినిమా తీశారు.

దండుపాళ్యం మూవీ ఫస్ట్ పార్టు ఐదేళ్ల క్రితం రిలీజవగా రెండోభాగం ఈ ఏడాది రిలీజైంది. ఇందులో కన్నడ హీరోయిన్ పూజా గాంధీతోపాటు బుజ్జిగాడు సినిమాలో అందాలు ఒలకబోసిన సంజన పూర్తి డీ గ్లామరైజ్డ్ రోల్స్ చేసింది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాసరాజు ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు మూవీ తీయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా హీరో శర్వానంద్ ను కలిసి కథ కూడా వినిపించాడట. ఇంతవరకు తన కెరీర్ లో ఇటువంటి పాత్ర చేయకపోవడంతో సినిమా చేయడానికి శర్వానంద్ కూడా ఓకే అన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఈమధ్య కాలంలో రొమాంటిక్ కామెడీలతో దూసుకెళుతున్న శర్వానంద్ కెరీర్ లో ఇదో చెప్పుకోదగ్గ చిత్రమవుతుందని అంటున్నారు.

వీళ్లిద్దరి కాంబినేషనల్ ఈ సినిమా స్టార్టవడానికి మాత్రం ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆల్రెడీ ఓకే చెప్పేశాడు. ఈ రెండింటి తరవాతే శ్రీనివాసరాజు సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశముంది.