Begin typing your search above and press return to search.

కరోనా క్రైసిస్ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై స్పందించిన నిర్మాత

By:  Tupaki Desk   |   24 April 2020 1:30 AM GMT
కరోనా క్రైసిస్ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై స్పందించిన నిర్మాత
X
కరోనా ఎఫెక్ట్ కారణంగా సినీ ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బపడినట్టే కనిపిస్తోంది. రెండు వారాలు అనుకున్న లాక్ డౌన్ ఇప్పుడు వచ్చే నెల దాకా పొడిగించారు. దీంతో ప్రేక్షకులతో కళకళలాడే థియేటర్స్ నిర్మానూహ్యంగా మారిపోయాయి. ప్రేక్షకుల కిటకిటలతో సందడిగా ఉండే సినిమా హాళ్ళు - మాల్స్ వెలవెలబోతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో... ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందో చెప్పలేని సిచ్యుయేషన్. ఈ నేపథ్యంలో భారత చిత్ర పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటోందని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నో విపత్తులను సినీ ఇండీస్ట్రీ ఎదుర్కొన్నప్పటికీ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను మాత్రం ఎదురుకాలేదని.. కానీ ఎలాంటి పరిస్థితుల నుంచైనా బౌన్స్ బ్యాక్ అవుతామని ధీమా వ్యక్తం చేసాడు. ప్రకృతి సృష్టించిన ఈ సంక్షోభం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని.. ఈ కఠినమైన సమయాల్లో ఫైనాన్షియర్లు మరియు బ్యాంకులు మా నిర్మాతలకు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నానన్నాడు. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు సమయంలో తీవ్రంగా నష్టపోయారంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ కారణంగా ఎగ్జిబిషన్ రంగం ఎక్కువగా ప్రభావితమవుతుందని.. అందుకే థియేటర్లకు కనీస విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వాలను కోరమని.. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు. పరిస్థితులు యధాస్థితికి వచ్చేందుకు ఒక ఏడాది సమయం పట్టవచ్చు.. లేదా అంతకంటే ఎక్కువ టైం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని తెలిపాడు. ప్రేక్షకులు భయం లేకుండా థియేటర్లకు రావడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదని.. ఇండస్ట్రీలో మునుపటి స్థితి ఏర్పడాలంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చి వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావాలి.. అప్పుడే ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు పరుగులు పెడతారని సురేష్ బాబు అభిప్రాయ పడ్డారు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీ లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని.. థియేటర్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ వాళ్ళు మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరముందని.. ప్రతి ఒక్కరూ ఖర్చు తగ్గించడంపై ఎక్కువ దృష్టి పెట్టి సినిమా బడ్జెట్‌ కంట్రోల్ చేయాలని తెలిపారు. భవిష్యత్తులో నిర్మాతలందరూ మాట్లాడుకొని సినీ ఇండస్ట్రీని ప్రాబ్లమ్స్ నుండి గట్టెక్కించడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటామని.. ఇప్పటికే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలకు మొదటగా థియేటర్లలో అడుగుపెట్టే అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ కోసం వెబ్ కంటెంట్‌ ను రూపొందించే ప్రణాళికలో ఉన్నామని.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చాడు.