Begin typing your search above and press return to search.

హిట్టు కోసం మ్యూజిక్ మ్యాస్ట్రోనే నమ్ముకున్న క్రియేటివ్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   16 Jun 2022 10:30 AM GMT
హిట్టు కోసం మ్యూజిక్ మ్యాస్ట్రోనే నమ్ముకున్న క్రియేటివ్ డైరెక్టర్..!
X
సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఓ శిఖరమని చెప్పాలి. కొన్ని దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాటలను స్వరాలు సమకూర్చిన మ్యూజిక్ మ్యాస్ట్రో.. నేటితరం సినీ ప్రియులను కూడా ఆకట్టుకునే సంగీతంతో తన ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగులో ఇళయరాజా ఎన్నో మంచి పాటలను అందించి శ్రోతలను విశేషంగా అలరించారు. ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోన్న లెజండరీ సంగీత దర్శకుడు.. ఇప్పుడు "రంగమార్తాండ" చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రంగమార్తాండ". మరాఠీలో ఘన విజయం సాధించిన 'నటసమ్రాట్' సినిమాకు ఇది అధికారిక తెలుగు రీమేక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం సంగీత దర్శకుడు ఇళయరాజా 'రంగమార్తాండ' చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. ఇళయరాజాతో కలిసి ఉన్న ఫొటోతో పాటుగా.. మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోస్ ను షేర్ చేస్తూ లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ ఎక్స్ప్రీరియన్స్ ను పంచుకున్నారు.

గతంలో డైరెక్టర్ కృష్ణవంశీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన 'అంతఃపురం' సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రతిదీ హైలైట్ గా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటంతో.. 'రంగమార్తాండ' సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.

'రంగమార్తాండ' చిత్రంలో రమ్యకృష్ణ - బ్రహ్మానందం - అనసూయ భరద్వాజ్ - రాహుల్ సిప్లిగంజ్ - శివాత్మిక రాజశేఖర్ - అలీ రేజా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేసి, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించనున్నారు.

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ.. చివరగా 2017లో 'నక్షత్రం' అనే ప్లాప్ చిత్రాన్ని అందించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు 'రంగమార్తాండ’ సినిమాతో రాబోతున్నారు. మరి ఈ మరాఠీ రీమేక్ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.