Begin typing your search above and press return to search.

ఏఎన్నార్ జయంతి సందర్భంగా NC22 నుంచి క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   20 Sep 2022 9:36 AM GMT
ఏఎన్నార్ జయంతి సందర్భంగా NC22 నుంచి క్రేజీ అప్డేట్..!
X
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్‌ లో ఓ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. #NC22 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

NC22 అనేది చైతన్య కెరీర్ లో మొదటి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం. అలానే తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభుకి తొలి తెలుగు చిత్రం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ఇటీవల అధికారిక పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అలానే హీరోయిన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్స్ ను ప్రకటించారు.

'బంగార్రాజు' సినిమాలో నాగ చైతన్యకు జోడీగా నటించిన అందాల భామ కృతి శెట్టి.. ఈ సినిమాలో మరోసారి చైతూ తో రొమాన్స్ చేయబోతోంది. మ్యాస్ట్రో ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

లెజెండరీ తండ్రీకొడుకుల ద్వయం కలిసి సంగీతం అందిస్తుండటం.. ఈ సినిమా ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మారింది. ఈ కలయికలో చార్ట్‌ బస్టర్ ఆల్బమ్ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే యువన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అక్కినేని అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి కారణంగా మేకర్స్ షూటింగ్ అప్డేట్ తో వచ్చారు. రేపు గురువారం హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నాగచైతన్య 22వ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు మేకర్స్ ట్వీట్ చేస్తూ.. "అక్కినేని నాగేశ్వరరావు గారి దివ్య ఆశీస్సులతో, నాగ చైతన్య మరియు వెంకట్ ప్రభు సహకారంతో మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ప్రకటిస్తున్నాము. రేపటి నుండి #NC22 యాక్షన్ బిగిన్ అవుతుంది" అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆవిష్కరించిన నాగ చైతన్య అనౌన్స్ మెంట్ పోస్టర్‌ అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు.. ఆసక్తిని పెంచింది. చై లుక్ రివీల్ చేయకుండా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. అతను కొన్ని టార్గెట్‌ లతో నిలబడి ఉన్నాడు. రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో ఉన్న ఈ పోస్టర్ పవర్ ఫుల్ వైబ్‌ ని కలిగిస్తుంది.

ఇందులో తాను ఓ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్లు చైతూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అండ్ యాక్షన్ అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది చై కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌ ప‌తాకంపై శ్రీనివాస్ చిట్టూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.