Begin typing your search above and press return to search.

కంగనా సిస్టర్స్ కు కోర్టులో ఊరట..!

By:  Tupaki Desk   |   10 Nov 2021 4:05 AM GMT
కంగనా సిస్టర్స్ కు కోర్టులో ఊరట..!
X
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు ఆమె సోదరి రంగోలి చందేల్ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని గతంలో ముంబైలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అక్కాచెల్లెళ్లకు ఊరట లభించింది. అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లో న్యాయవాది కాషిఫ్ అలీ ఖాన్ దేశ్ ముఖ్ దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది.

గతేడాది ఏప్రిల్ లో రంగోలీ చందేల్ తన ట్విట్టర్ ఖాతాలో తబ్లిఘి జమాత్ కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిందని ఆరోపిస్తూ కాషిఫ్ అలీ ఖాన్ దేశ్ ముఖ్ కోర్టులో కేసు వేశారు. సోదరికి మద్దతుగా నిలిచినందుకు కంగనా రనౌత్ కు కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కాషిఫ్ అలీ ఖాన్ పిటిషన్ ను తిరస్కరించింది.

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153 A - 153 B - 295 A మరియు సెక్షన్ 505 కింద నిందితులపై విచారణకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని.. అది లేని కారణంగా ఈ పిటిషన్ ని తిరస్కరిస్తునట్లు మేజిస్ట్రేట్ భగవత్ టి తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన తగిన ఆధారాలు కూడా లేవని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఇకపోతే కాషిఫ్ అలీ ఖాన్ దేశ్ ముఖ్ ఈ తీర్పుపై స్పందించారు. దిగువ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తాను దిండోషి సెషన్స్ కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను దాఖలు చేశానని చెప్పారు. కంగనా రనౌత్ మరియు ఆమె సోదరి గతంలో ట్విట్టర్ వేదికగా వివిధ మతాల గురించి మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. వారి మనోభావాలను దెబ్బతీశారని కాషిఫ్ అలీ ఖాన్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ రివిజన్ దరఖాస్తును దిండోషి సెషన్స్ కోర్టు నవంబర్ 15న విచారించనుంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌ లోని మొరదాబాద్‌ లో కరోనాతో మృతి చెందిన ఓ జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై అక్కడి వారు దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన రంగోలి చందేల్‌ ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్‌ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలని వ్యాఖ్యానించింది. దీంతో రంగోలి ట్విటర్‌ ఖాతాను అధికారులు తొలగించారు.

దీనిపై కంగనా స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ వీడియోను విడుదల చేసింది. తన సోదరి రంగోలి చందేల్‌‌ ట్విటర్‌ ఖాతాను తొలిగించటాన్ని తప్పుబడుతూ.. గతంలో రంగోలి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. అంతేకాకుండా సదరు వర్గానికి చెందిన వారిని టెర్రరిస్టులని కంగనా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కాషిఫ్ అలీ ఖాన్ దేశ్ ముఖ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.