Begin typing your search above and press return to search.

మ‌ల్టీ పెక్సుల్లో పార్కింగ్ దందా.. జేబులు గుల్ల‌..

By:  Tupaki Desk   |   21 Nov 2021 1:30 AM GMT
మ‌ల్టీ పెక్సుల్లో పార్కింగ్ దందా.. జేబులు గుల్ల‌..
X
అభివృద్ధి చెందిన న‌గ‌రాల్లో.. ఏర్పాటు చేస్తున్న మ‌ల్టీ పెక్సులు, మాల్స్‌కు వ‌చ్చే జ‌నాల నుంచి పార్కింగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయ‌లు.. అన్న‌చందంగా జ‌రుగుతోంది. బండి పెడితే.. డ‌బ్బు.. తీస్తే.. డ‌బ్బు.. అన్న‌ట్టుగా ఈ కాంప్లెక్సుల యాజ‌మాన్యం ప్ర‌జ‌ల జేబులు గుల్ల చేస్తోంది. సాధార‌ణం నుంచి అసాధార‌ణ స్థాయిలో జ‌రుగుతున్న ఈ దోపిడీపై వాహ‌న‌దారులు గ‌గ్గోలు పెడుతున్నా.. సంబంధిత అధికారులు కానీ.. విజిలెన్స్ బృందాలు కానీ.. ప‌ట్టించుకుంటున్న పాపాన పోవ‌డం లేదు. పైగా .. ఫిర్యాదు చేసిన వారే..సంబంధిత వివ‌రాలు ఇవ్వాలంటూ.. కొత్త మెలిక పెట్టి.. మ‌ల్టీ పెక్స్‌ల యాజ‌మాన్యాల‌కు స‌హ‌క‌రిస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

మెట్రో న‌గ‌రంగా కీర్తి కెక్కిన భాగ్య న‌గ‌రంలో ఈ మాల్స్‌, మ‌ల్టీ పెక్సుల్లో జ‌రుగుతున్న పార్కింగ్ దోపిడీ దందా.. గురించి ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిద‌న్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ప్ర‌స్తుతం ఉన్న పార్కింగ్ ఫీజుల‌ను గ‌మ‌నిస్తే.. చిన్న‌పాటి ధియేట‌ర్ల‌లో బైకుల‌కు రూ.20, కార్ల పార్కింగుకు రూ.30 చొప్పున వసూలు చేయవచ్చు. మాల్స్‌, మల్టీప్లెక్స్‌, ఇతర వాణిజ్య సముదాయాల్లో పాత నిబంధనలే వర్తిస్తాయి. జూలై 20(2021)న పురపాలక శాఖ ఉత్తర్వుల(జీఓ-121) ప్ర‌కారం.. గ్రేటర్‌లోని కొన్ని మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నాయి. అయితే.. చిన్న‌పాటి థియేటర్లలోనూ నిర్ణీత మొత్తం కంటే ఎక్కువగా పార్కింగ్ రుసుము తీసుకుంటున్నారు.

ఇలా వ‌సూళ్లు చేయ‌కూడ‌ద‌ని ఉన్నా.. ప్ర‌జ‌లు దీనిపై జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ (సీఈసీ) ట్విట్టర్‌ ఖాతాకు ఫిర్యాదులు చేస్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతేకాదు.. దొంగ‌త‌నం చేశాడ‌ని అన్న‌వారినే దొంగ‌ను ప‌ట్టుకురండి అన్న‌ట్టుగా ట్విట్టర్‌లో వచ్చే ఫిర్యాదుల విషయంలో పూర్తి వివరాలతో లెటర్‌ ఇవ్వండి.. లేదా మీ నెంబర్‌ ఇస్తే మా సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తారని సమాధానం చెబుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు బహిర్గతం చేయడం లేదు. థియేటర్లు, మాల్స్‌లో తనిఖీలు నిర్వహించని అధికార యంత్రాంగం.. ఫిర్యాదులపైనా సరిగా స్పందించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాస్త‌వానికి మాల్స్‌, సినిమా హాళ్ల‌లో పార్కింగ్‌ దందాపై 2018లోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఉచిత పార్కింగ్‌కు అవకాశం కల్పించింది. రుసుము వ‌సూలు చేయ‌రాద‌ని.. మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వినియోగ‌దారుల నుంచి ఇలా వ‌సూలు చేయ‌డం విరుద్ధ‌మ‌ని పేర్కొంది. ఈ మేర‌కు 2018న పురపాలక శాఖ ఉత్తర్వులు (జీఓ-63) జారీ చేసింది. దీని ప్ర‌కారం మాల్స్‌, మల్టీప్లెక్సుల్లో అర‌గంట వ‌ర‌కు కొనుగోళ్లతో సంబంధం లేకుండా ఉచిత పార్కింగ్‌కు అవకాశముంటుంది. 30 నిమిషాల నుంచి గంట వరకు ఎంతో కొంత కొనుగోలు చేసినా పార్కింగ్ వ‌సూలు చేయ‌రు. గంటపైన వాహనం నిలిపితే... పార్కింగ్‌ రుసుము కంటే ఎక్కువ కొనుగోలు చేసిన బిల్లు/సినిమా టికెట్‌ చూపిస్తే పార్కింగ్‌ ఫ్రీ అని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లుగా ఈ విధానం అమలవుతోంది.

ఈ నేప‌థ్యంలో చిన్న‌పాటి థియేటర్ల యజమానులు కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ వర్గాలతో చ‌ర్చించాయి. సినిమాకు రాని వారు సైతం థియేటర్ల ప్రాంగణాల్లో వాహనాన్ని నిలుపుతున్నారని, ఇది పెద్ద సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. వాహనాలను కాపాడడం, క్రమపద్ధతిలో పార్కింగ్‌ చేసేలా నియమించే సిబ్బందికి వేతనాల చెల్లింపు ఆర్థికంగా భారమవుతుందని పాలకుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన పురపాలక శాఖ ఇలాంటి థియేటర్లలో పార్కింగ్‌ రుసుం వసూలుకు అవకాశం కల్పించింది. మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో మాత్రం ఉచితంగానే పార్కింగ్ అని పేర్కొన్నారు.

అయితే.. ప్ర‌భుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటును త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న య‌జ‌మానులు.. కొన్ని స్టాండ్‌ ఎలోన్‌ థియేటర్లలో ద్విచక్ర వాహనాలకు రూ.30, కార్ల పార్కింగుకు రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. మాల్స్‌, మల్టీప్లెక్సుల్లో పరిస్థితి దారుణంగా మారింది. జీఓను ప్రస్తావిస్తూ.. మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసిన వారి నుంచి పార్కింగ్‌ ఫీజు తీసుకుంటున్నారు. న‌గ‌రం వ్యాప్తంగా ఇదే దందా న‌డుస్తుండ‌డంతో వాహ‌న‌దారులైన వినియోగ‌దారులు గ‌గ్గోలు పెడుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. గ్రేట‌ర్‌.. అధికారులు ప‌ట్టించుకుంటారో.. లేదో చూడాలి.