Begin typing your search above and press return to search.

యువ దర్శకులపై కరోనా ప్రభావం అలా ఉందా?

By:  Tupaki Desk   |   7 May 2020 3:20 PM IST
యువ దర్శకులపై కరోనా ప్రభావం అలా ఉందా?
X
కరోనా క్రైసిస్ ప్రభావం సినిమా రంగంలో అందరి మీద ఎంతో కొంత ఉంది. అలాగే యువ దర్శకులపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉండబోతోందని అంటున్నారు. దీనికి కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. విషయం ఏంటంటే యువదర్శకులకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఇబ్బందికరంగా మారాయట.

గతంలో కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు చాలామంది ఇళ్ళలో ఉండేవి కానీ వాటిలో సినిమాలు చూసేందుకు సమయం చిక్కేది కాదు. ఎప్పుడో సమయం దొరికనప్పటికీ ఒకటి అరా సినిమాలు చూసి సరిపెట్టుకునేవారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ తమ తమ ఇళ్ళలో కూర్చోవడంతో అందరి దృష్టి ఓటీటీలపై కి మళ్ళింది. ఆల్రెడీ ఓటీటీలు ఉన్నవారితో పాటుగా కొత్తగా సబ్ స్క్రిప్షన్ లు తీసుకున్నవారు అందులో ఏం సినిమాలు ఉన్నాయో వాటిని వరసబెట్టి చూస్తున్నారు. ఒక్క తెలుగుతో ఆపడం లేదు. హిందీ.. ఇంగ్లీష్ చూసేవారు వాటిని కూడా చూస్తున్నారు. ఇంతటితో ఆగడం లేదు. తమిళం.. మలయాళం.. కన్నడ.. గుజరాతి.. బెంగాలి.. ఇలా భాషా భేదం లేకుండా అన్నీ సినిమాలను దంచుకుంటున్నారట. వీటితో పాటుగా స్పానిష్ జపనీస్.. కొరియన్ సినిమాలను.. వెబ్ సీరీసులను మధ్యలో నంజుకుంటున్నారట. దీంతో దర్శకులకు ఇబ్బంది ఏంటి అంటారా? వీటిలో ఎక్కడ నుంచి ప్రేరణ పొందినా లేక డైరెక్ట్ గా కాపీ కొట్టినా సదరు సినిమాలలో ఫ్రెష్ నెస్ మిస్ అవుతుంది.

ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఈ ప్రేరణలపైనే ఆధారపడతారనేది వాస్తవం. ఇప్పుడు అలాంటి వారికి ఈ లాక్ డౌన్ శరాఘాతంగా మారిందని అంటున్నారు. గతంలో ఒటీటీలను నమ్ముకుని వాటిలో ఉండే కంటెంట్ ను మన నేటివిటీకి తగ్గట్టు మార్చేసే వారికి గడ్డుకాలం వచ్చిందట. వారిప్పుడు తప్పనిసరి పరిస్థితులో ఒరిజినల్ కంటెంట్ తయారు చెయ్యాల్సి వస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీని కారణంగా స్ఫూర్తి.. ఫ్రీ మేక్ లాంటివి టాలీవుడ్ లో తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఇండస్ట్రీలో కాపీ రాయుళ్ళు తగ్గి పోతారని.. దాని వల్ల పరిశ్రమకు మంచిపేరు వస్తుందని అంటున్నారు.