Begin typing your search above and press return to search.

#క‌రోనా: పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ఫ‌జిల్ వీడేదెపుడు?

By:  Tupaki Desk   |   8 May 2020 9:38 AM IST
#క‌రోనా: పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ఫ‌జిల్ వీడేదెపుడు?
X
క‌రోనా బాంబ్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌పైనా ప‌డిన‌ట్టే వినోద ప‌రిశ్ర‌మ‌పైనా ప‌డింది. దేశంలోని అన్ని సినీరంగాల‌పైనా అద‌న‌పు దుష్ప్ర‌భావం చూస్తున్న‌దే. ఇది ఈ రంగంలో ఉపాధిని తీవ్రంగా దెబ్బ కొట్టింద‌నడంలో సందేహ‌మేం లేదు. ఇప్ప‌టికే సినీకార్మికులు నిత్యావ‌స‌రాల‌కు సైతం జోలె ప‌ట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. నెల‌ల స‌మ‌యం గ‌డిచినా ఇంకా ఎవ‌రూ బ‌య‌టికి రాలేని ప‌రిస్థితి. కార్మికుల్ని పోషించే నిర్మాత‌ల ప‌రిస్థితి అంత‌కు ఏమీ తీసిపోలేద‌న్న‌ది ఓ అంచ‌నా. ఇంకా ఏపీ-తెలంగాణ స‌హా దేశంలో క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయే కానీ త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు సాక్షాత్తూ దేశాధ్య‌క్షుడు ట్రంప్ స‌హాయ‌కుడికే క‌రోనా అంటుకుందంటే ఇక అమెరికా మార్కెట్ పై ఆధార‌ప‌డిన తెలుగు సినిమా ప‌రిస్థితేమిటో! లాక్ డౌన్ ఆపేదెపుడు? షూటింగులు జ‌రిగేదెపుడు? పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌య్యేదెపుడు? సినిమాల్ని రిలీజ్ చేసేదెపుడు?

ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ షూటింగులు పూర్తి చేసుకుని ల్యాబుల్లో ఎడిటింగ్-రీరికార్డింగ్-మిక్సింగ్-డ‌బ్బింగ్ స‌హా ఇత‌ర‌త్రా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు అందుబాటు లో ఫీడ్ ఉంది. కానీ టాలీవుడ్ లో ఇప్ప‌టివ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి సైతం అనుమ‌తులు లేవు. చాలా మీడియం బడ్జె‌ట్ సినిమాల‌తో పాటు.. ఆర్.ఆర్.ఆర్- జాన్ స‌హా ఎన్నో భారీ చిత్రాల‌కు ఇదే స‌న్నివేశం. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి ప‌రిమితుల‌తో కూడుకున్న అనుమ‌తులు పొంద‌డంలో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ ఒక అడుగు ముందుకు వేసింది. ఆ త‌రహాలో అయినా టాలీవుడ్ కి వెసులుబాటు ఉంటుందా? అన్న‌ది చూడాలి.

దీనిపై టాలీవుడ్ నిర్మాత‌ల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌భుత్వాల‌తో మంత‌నాలు సాగించే ఆలోచ‌న‌లోనూ ఉన్నారు. ఇప్ప‌టికే తెరిచిన ఆఫీసుల‌కు రెంట్లు క‌ట్ట‌లేక‌.. వాటిని మెయింటెయిన్ చేయ‌డం ప‌నోళ్ల‌కు జీతాలు చెల్లించ‌డం వ‌గైరా క‌ష్టాలు ఉండ‌నే ఉన్నాయి. ఒక ర‌కంగా న‌డిసంద్రంలో నావ‌లా అయిపోయింది నిర్మాత ప‌రిస్థితి. ఇది ఇంకా ఆల‌స్య‌మైతే నేరుగా ల్యాబుల నుంచే లీకులు లేదా ఇంకేదైనా గంద‌ర‌గోళం త‌లెత్తితే అప్పుడు జ‌రిగే డ్యామేజీ ఊహించ‌లేనిది. ఇక పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలంటే ఫైనాన్షియ‌ర్ల నుంచి ఫైనాన్సులు తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి అనుమ‌తులు ల‌భిస్తే కొంత‌వ‌ర‌కూ ఇది సాధ్యం. కానీ హైద‌రాబాద్ లో ప‌నుల‌కు వెసులుబాటు ఎంత‌? అన్న‌దే స‌స్పెన్స్. ఇక్క‌డ‌ క‌రోనా అంత‌కంత‌కు విస్త‌రిస్తున్న నేప‌థ్యం లో స్టూడియోల్లో నిర్మాణానంత‌ర‌ ప‌నుల‌కు తెరాస ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తుందా? అన్న‌ది వేచి చూడాలి. ఈ గండం నుంచి గ‌ట్టెక్క‌డ‌మెలా? అన్న ఆందోళ‌న టాలీవుడ్ ప్ర‌ముఖుల్లో ఉంది.