Begin typing your search above and press return to search.

గొడ‌వ‌ల‌వ్వ‌క ముందే నిర్మాత‌ల మండ‌లి చొర‌వ ఏదీ?

By:  Tupaki Desk   |   28 April 2020 4:00 AM GMT
గొడ‌వ‌ల‌వ్వ‌క ముందే నిర్మాత‌ల మండ‌లి చొర‌వ ఏదీ?
X
క‌రోనా క‌నిపించ‌కుండా కాల్చేస్తోంది. ఎప్పుడు ఎట్నుంచి ఏ ప్ర‌మాదం ముంచుకొస్తుందో తెలీని ప‌రిస్థితి. ఈ సన్నివేశాన్ని సినీప‌రిశ్ర‌మ‌లు అస‌లే ఊహించ‌లేదు. ఏదో ఒక వేవ్ లా వ‌చ్చి వెంట‌నే వెళ్లిపోతుంద‌నే అనుకున్నారంతా. కానీ ఇది రోజులు నెల‌ల త‌ర‌బ‌డి తిష్ఠ వేసి కూచుకుంది. దీని ప్ర‌భావంతో దేశం.. ప్ర‌పంచం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. రాష్ట్రాలు అత‌లాకుత‌లం అయిపోయాయి. ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో బ‌తికే ప‌రిస్థితి ఉంది. ఇలాంట‌ప్పుడు సినిమాలు రిలీజ్ చేసే ప‌రిస్థితి ఉందా? అంటే ఇప్ప‌ట్లో లేనే లేద‌ని అర్థ‌మ‌వుతోంది. సార్స్ - ఎబోలా- ఆంథ్రాక్స్ లా కొద్దికాలానికే ఇది ప‌రిమిత‌మ‌వ్వ‌ద‌ని స‌న్నివేశం చెబుతోంది. సాక్షాత్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులే ఇక క‌రోనాతో మ‌నం చాలా కాలం జీవించాల్సి ఉంటుంద‌ని చెప్పారంటే సీన్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అన్ని ఇండ‌స్ట్రీల్ని ఆడుకున్న క‌రోనా ఇప్పుడు సినీప‌రిశ్ర‌మ‌ల్ని ప‌ట్టి కుదిపేస్తోంది.

ఈ చిచ్చు ఆర‌నిది. గుండెల్ని మండించేది అని స‌న్నివేశం చెబుతోంది. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ లో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డ్డారు. సంఘ‌టిత‌.. అసంఘ‌టిత కార్మికులు అనే తేడాలేం లేవు. అంద‌రికీ తిండీ తిప్ప‌లు లేని ప‌రిస్థితి ఇంకెంతో దూరంలో లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ అన్న‌పూర్ణ క్యాంటీన్లు.. సీసీసీ లాంటి చారిటీలు పెట్టి ఆదుకోక‌పోతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించేదే.

ఇదంతా స‌రే కానీ.. కరోనా దెబ్బ థియేట‌ర్ల‌పైనా మాల్స్ పైనా మామూలుగా లేద‌న్న విశ్లేష‌ణ‌లు ఇప్ప‌టికే జోరందుకున్నాయి. వ్యాక్సినేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ ఇవి తెరుచుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఒక‌వేళ లాక్ డౌన్ ఎత్తేసి కండీష‌న్ల‌ పై థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ల‌భించినా `అంటు వ్యాధి` అన్న‌ భ‌యంతో ప్ర‌జ‌లు వ‌స్తారా రారా? అన్న సందేహాలున్నాయి. ఇక క‌రోనాతో జీవించాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంత‌టి వారే సెల‌విచ్చాక థియేట‌ర్లు ఫిల్ అవుతాయా చెప్పండి? ఎడం ఎడంగా సామాజ‌క దూరం పాటిస్తూ సినిమాలు చూడాలి! అంటే కుదురుతుందా? థియేట‌ర్ల‌లో క‌ట్ట‌డి ఎక్క‌డ సాధ్యం? అయినా స‌గం సీట్లు క్లోజ్ చేసేసినా కానీ మిగ‌తా సీట్ల‌కు స‌రిప‌డా జ‌నం వ‌స్తారా రారా? ఇలా అయితే ఆక్యుపెన్సీ లేక రెవెన్యూ ప‌డిపోయి వారంలో రావాల్సిన రెవెన్యూ 100 రోజుల త‌ర్వాత వ‌స్తుంది అనుకునే ప‌రిస్థితి ఉందా? ఇక బ‌డ్జెట్ తోనే పెద్ద బ‌ర్డెన్ అవుతుంటే.. ప‌బ్లిసిటీ ఖ‌ర్చులు .. ట్రేడ్ కి చెల్లింపులు అంటూ అద‌నంగా విధిలించుకునే ప‌రిస్థితి ఉంటుందా? ఇవ‌న్నీ ఆలోచిస్తే వీటికంటే డిజిట‌ల్ స్ట్రీమింగ్ చేయ‌డ‌మే ఉత్త‌మం అనుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇండ‌స్ట్రీల‌న్నీ డిజిటల్ స్ట్రీమింగ్ నే న‌మ్ముకోవాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే కోలీవుడ్ హీరోలంతా ఒక‌రొక‌రుగా డిజిట‌ల్ రిలీజ్ ల‌కు క్యూక‌డుతుంటే ఆ సీన్ చూసి మ‌న హీరోలు మారిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే దీన‌ర్థం థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజ్ చేయ‌డం ఇక ఏడాది రెండేళ్ల పాటు కుద‌ర‌ద‌నేగా! వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కూ ఆగాల‌నే ధోర‌ణి ఇదేన‌ని అనుకోవ‌చ్చు క‌దా! ఇలా జ‌రిగితే ఎగ్జిబిష‌న్ రంగం చాప చుట్టేసిన‌ట్టే. ఇంత‌కుముందు క‌ళ్యాణ మంట‌పాలు చేశారు. కానీ ఇప్పుడేం చేయాలి? అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితి టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్రిక్త‌త‌కు దారి తీయొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. హీరోలు- నిర్మాత‌ల్ని ఎగ్జిబిట‌ర్లు వ్య‌తిరేకించి గొడ‌వ‌కు దిగితే ప‌రిస్థితేంటి? ఇప్ప‌టికే త‌మిళంలో సూర్య‌పై థియేట‌ర్ య‌జ‌మానులు తిర‌గ‌బ‌డుతున్నారు. అదే స‌న్నివేశం తెలుగులోనూ త‌లెత్తితే ప‌రిస్థితేమిటి? క‌రోనా దెబ్బ అన్నిటి కంటే థియేట‌ర్ల‌ పైనే గ‌ట్టిగా ప‌డింద‌నేందుకు ఇంత‌కంటే ఇంకేం చెప్పాలి? అయితే గొడ‌వ‌లు జ‌ర‌గ‌క ముందే నిర్మాత‌ల మండ‌లి ఒక స‌రికొత్త ఫార్ములాని త‌యారు చేసి ఎగ్జిబిట‌ర్ల‌తో ముచ్చ‌టిస్తే కొంతవ‌ర‌కూ గొడ‌వ‌లు ఆగుతాయేమో!