Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఈ మార్పులు పక్కా అంటున్నారే!

By:  Tupaki Desk   |   14 April 2020 5:50 AM GMT
టాలీవుడ్ లో ఈ మార్పులు పక్కా అంటున్నారే!
X
కరోనావైరస్ ప్రభావం అన్నీ రంగాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా పడనుంది. సినిమా ఇండస్ట్రీ పైన కోవిడ్-19 ప్రభావం ఇప్పటికే డైరెక్ట్ గా పడింది. గత కొన్ని వారాలుగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. షూటింగులు.. ఇతర కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఒక్కటంటే ఒక్క కొత్త రిలీజు కూడాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నడూ లేని సమస్యను సినీ పరిశ్రమ ఎదుర్కొంటోంది.

ఈ ప్రభావంతో టాలీవుడ్ లో పలు మార్పు చేర్పులు రానున్నాయని అంటున్నారు. సినిమా రిలీజులు ఆగిపోతే.. షూటింగులు ఆగిపోతే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది నిర్మాతలే. అసలు నిర్మాతలు ఉంటేనే.. వారు సినిమాలు నిర్మిస్తేనే సినిమాలు థియేటర్ల కు వస్తాయి. అక్కడే ఇబ్బంది నెలకొంటే ఇక బయ్యర్లు .. డిస్ట్రిబ్యూటర్ల ప్రస్తావనే రాదు. అందుకే నిర్మాతలను ఈ సమయంలో ఆదుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. నటీనటులు.. టెక్నీషియన్లు సినిమా రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ తమ పారితోషికాలను తగ్గించుకోవాలని.. ఇలాంటి క్లిష్ట సమయంలో నిర్మాతలకు అండగా నిలవాలని అంటున్నారు. ముఖ్యంగా కోట్లలో డబ్బు వసూలు చేసే స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు.. స్టార్ టెక్నీషియన్లు ఈవిషయం లో చొరవ తీసుకుంటే ఇతర నటీనటులు.. టెక్నీషియన్లు కూడా వారిని అనుసరిస్తారని అంటున్నారు.

పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమాలపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నారు. లాక్ డౌన్ విరమణ తర్వాత కూడా చిన్న సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉండదని.. దీంతో చిన్న సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై దృష్టి పెట్టి ఓ లాభసాటి బిజినెస్ మోడల్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు ఎప్పుడూ ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బడ్జెట్లలో కోత విధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కొత్త ప్రాజెక్టుల బడ్జెట్లు కూడా సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ కు ఎలాగూ అనుమతులు ఇప్పుడే లభించవు కనుక విదేశీ షూటింగులకు కొంతకాలం బ్రేక్ పడే అవకాశం ఉంది.