Begin typing your search above and press return to search.

#క‌రోనా: థియేట‌రా.. ఓటీటీనా.. ఆశ అడియాసేనా?

By:  Tupaki Desk   |   10 April 2020 11:15 AM IST
#క‌రోనా: థియేట‌రా.. ఓటీటీనా.. ఆశ అడియాసేనా?
X
ఆశ నిరాశ‌ల మ‌ధ్య మ‌నిషి కొట్టుమిట్టాడుతున్నాడు. తిన‌టానికి తిండి దొరికితే చాలు ఏదోలా బ‌తికేస్తాన‌ని సామాన్యుడు ఆలోచిస్తున్నాడు. బిజినెస్ లు గాలికి కొట్టుకుపోకుండా ద‌క్కిందే ద‌క్కుడు అన్న‌ట్టుగా ఉన్న‌వాటిని సేల్ చేసేందుకు వ్యాపారులంతా ఎవ‌రి ప్లాన్స్ లో వాళ్లు ఉన్నారు. ఇవ‌న్నీ క‌రోనా పాఠాల ఫ‌లితం. అస‌లేం జ‌రుగుతోందో తెలియ‌కుండానే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ మొత్తం జ‌రిగిపోయింది. టాలీవుడ్ అయితే నిండా మునిగింది. షూటింగుల్లేవ్.. థియేట‌ర్లు లేవు. వ్యాపారం అసలే లేదు. మ‌రో నెల‌రోజుల్లో అయినా స‌ర్ధుకుంటుందా? అంటే సీన్ అలా క‌నిపించ‌డం లేదు. కొవిడ్ 19 వ్యాక్సినేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ ఇదే స‌న్నివేశం ఉండేట్టు క‌నిపిస్తోంది.

ఇలాంటి వేళ ఏ వ్యాపారం ఎలా పూర్తి చేయాలి? ఎలా సేఫ్ అవ్వాలి? అన్న డైల‌మా నెల‌కొంది. సినీరంగం ప‌రిస్థితి ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. కోట్ల‌కు కోట్లు పెట్టేసి ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసిన‌ సినిమాల్ని ఏం చేయాలి? ఆరు గాలం ఎంతో శ్ర‌మించి పండించిన పంట‌లా సినిమా ఎదురు చూస్తోంది. స‌రిగ్గా ఇదే డైల‌మాలో ప‌లువురు నిర్మాత‌లు ఏదో ఒక‌టి చేసి మొత్తానికి న‌ష్ట‌పోకుండా బ‌య‌ట‌ప‌డాల‌ని త‌పిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే సేఫ్ జోన్ ఏం ఉందో చూసుకుని అలా రిలీజ్ చేసే ప‌నిలో ఉన్నారు. వీళ్లంద‌రికీ థియేట‌ర్ రిలీజ్ కంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఓటీటీ రిలీజ్ అయితేనే బెట‌ర్ అనే కొత్త దారి క‌నిపిస్తోంది. దీంతో ఇప్ప‌టికే ఓ ఇద్ద‌రు నిర్మాత‌లు ఓటీటీ రిలీజ్ కి సిద్ధ‌మైపోవ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఆ ఇద్ద‌రినీ చూసి మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌లు ఇదే ఆలోచిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చేశాయి. దీంతో కంగారు ప‌డిన హీరోలు మాత్రం ససేమిరా అనేస్తున్నార‌ట‌. థియేట్రిక‌ల్ రిలీజ్ వ‌ద్దు.. ఓటీటీనే ముద్దు! అని నిర్మాత‌లు అంటున్నా హీరోలు మాత్రం వ‌ద్దే వ‌ద్దు అనేస్తున్నార‌ట. హీరో అంగీక‌రించ‌కుండా ఓటీటీలో రిలీజ్ చేసేయ‌డం కుద‌రుతుందా? అందుక‌నే నిర్మాత‌లు సైతం మేక‌ పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ త‌మ సినిమాల్ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తామ‌ని చెబుతున్నార‌ట‌. అయితే ఈ ప‌ప్పులేవీ క‌రోనా ముందు ఉడికేట్టు క‌నిపించ‌డం లేదు. మార్చిలో రిలీజ్ కావాల్సిన‌వి. 15 రోజుల లాక్ డౌన్ త‌ర్వాత అంతా స‌ర్ధుకుంటే రిలీజ్ చేసేయొచ్చు అని ఆశ‌ప‌డ్డారు. కానీ లాక్ డౌన్ మ‌రో 15రోజులు పొడిగించ‌డంతో ఏప్రిల్ 15 వ‌ర‌కూ లాక‌య్యారు. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయ‌కుండా కంటిన్యూ చేసే స‌న్నివేశ‌మే క‌నిపిస్తుండ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఉంది. ఇక మ‌రోవైపు లాక్ డౌన్ ఎత్తేసినా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారా రారా? క‌రోనా క‌ల్లోలానికి భ‌య‌ప‌డి ఇళ్ల‌కే ప‌రిమిత‌మైతే రిలీజ్ చేసీ ఏం ఉప‌యోగం? ఇప్పుడున్న స‌న్నివేశంలో థియేట్రిక‌ల్ రిలీజ్ కి ప్ర‌భుత్వాలు- పోలీసులు అంగీక‌రిస్తారా? అన్న‌ది కూడా సందేహ‌మే. మరి ఈ సీన్ లో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న అమెజాన్ ప్రైమ్- నెట్ ఫ్లిక్స్ లాంటి వాటిని కాద‌నుకుంటే అంత‌కంటే మూర్ఖ‌త్వం ఇంకొక‌టి ఉండ‌దేమోన‌ని విశ్లేషిస్తున్నారు నిపుణులు. స‌వ్యంగా ప‌త్రిక‌లు ప్ర‌ధాన మీడియాల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తే అంత‌కంటే కావాల్సింది ఏం ఉంటుంది? కానీ అలా జ‌రిగేట్టు లేనే లేదు క‌దా స‌న్నివేశం? పాపం ఈ క‌ల్లోలంలో కంబ్యాక్ కోసం చూస్తున్న ఒక యువ‌హీరో.. డెబ్యూ కోసం చూస్తున్న వేరొక హీరో ఎర‌క్క‌పోయి అడ్డంగా ఇరుక్కుపోయారు మ‌రి!! బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి స‌క్సెస్ స్ట్రీక్ ని కొన‌సాగించాల‌ని చూస్తున్న హీరోలు ఇందులో క‌లిసిపోవ‌డం.. టూ బ్యాడ్!!