Begin typing your search above and press return to search.

ఓవ‌ర్సీస్ మ‌రో నైజాం‌... ఈ మాట మ‌ర్చిపోవాల్సిందేనా!

By:  Tupaki Desk   |   18 April 2020 4:00 AM GMT
ఓవ‌ర్సీస్ మ‌రో నైజాం‌... ఈ మాట మ‌ర్చిపోవాల్సిందేనా!
X
క‌రోనా క‌ల్లోలం ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది. మ‌హ‌మ్మారీ 210 దేశాల్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇక ఇండియా మార్కెట్లు పూర్తిగా డిపెండ్ అయ్యి ఉన్న అమెరికాపై క‌రోనా విజృంభ‌ణ అంతా ఇంతా కాదు. ల‌క్ష‌లాది కేసులు.. వేలాది మ‌ర‌ణాలతో అత‌లాకుత‌లంగా ఉంది సీను. దీని ప్ర‌భావం ఇటు టాలీవుడ్ పైనా అంతా ఇంతా కాద‌ని విశ్లేషిస్తున్నారు. దేశీయంగా అంతో ఇంతో క‌ట్ట‌డిలోనే ఉన్న కరోనా ట్రంప్ దేశాన్ని ప‌ట్టి పీడించేస్తోంది.

ప్ర‌స్తుత సీన్ చూస్తుంటే ఇప్ప‌ట్లో అమెరికా స‌హా ఓవ‌ర్సీస్ లో మాల్స్ .. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ ఓపెన‌య్యేందుకు ఆస్కార‌మే క‌నిపించ‌డం లేదు. అమెరికాలో విస్త్ర‌తంగా ఉండే మినీ థియేట‌ర్ల‌న్నీ ఆల్మోస్ట్ గాలికి కొట్టుకుపోయిన‌ట్టేన‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే ఇన్నాళ్లు తెలుగు సినిమాకి మ‌రో నైజాం మార్కెట్ అంత అని భావిస్తున్న అమెరికా నుంచి రెవెన్యూ జీరో అయిపోతుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అగ్ర హీరోల‌కు కేవ‌లం నైజాం నుంచి మినిమం 25-30 కోట్లు వ‌సూల‌వుతుంటే... అంతే పెద్ద మొత్తాన్ని ఇటీవ‌ల అమెరికా ఓవ‌ర్సీస్ నుంచి లాగేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రంగ‌స్థ‌లం 3.5 మిలియ‌న్ డాల‌ర్ల (సుమారు 20 కోట్లు) .. స‌హా బాహుబ‌లి ఫ్రాంఛైజీ.. మ‌రో ఐదారు చిత్రాలు సుమారు 16 కోట్ల మేర వ‌సూలు చేయ‌డంతో అమెరికా ఓవ‌ర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాకి కీల‌కంగా మారాయి. అటు బాలీవుడ్ సినిమాల‌తో పోటీప‌డుతూ మ‌న అగ్ర హీరోల సినిమాలు అమెరికాలో వ‌సూళ్లు సాగించాయి. మొన్న సంక్రాంతికి రిలీజైన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం అమెరికాలో బ‌న్ని కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

అయితే ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో విదేశాల్లో మ‌న సినిమా ప‌రిస్థితేంట‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. ముఖ్యంగా క‌ల్లోలానికి కేంద్రంగా మారిన అమెరికా ఇప్ప‌ట్లో కోలుకునే సీనే క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామం టాలీవుడ్ మార్కెట్ ని పెద్ద దెబ్బ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. మునుప‌టిలా సినిమాలకు ఏరియా రేటు అంత ఇంత అంటూ డిమాండ్ చేసే వీల్లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక అమెరికా మార్కెట్ ఇంత అని అక్క‌డ ఫిక్స్ డ్ గా చెప్ప‌డానికి లేనే లేదు. ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూష‌న్ లో ర‌క‌ర‌కాల లొసుగులు కూడా మ‌న మార్కెట్ ని ఎద‌గ‌నిచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని ఇదివ‌ర‌కూ ఫిర్యాదులు అందాయి. అమెరికా బ‌య్య‌రు.. పంపిణీ వ్య‌వ‌స్థ‌లో గూడు పుటాణీ వ్య‌వ‌హారం కూడా మార్కెట్ ని ఎద‌గ‌నివ్వ‌ద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఓవ‌ర్సీస్ లో కోటి బిజినెస్ అంటే ఒక‌ప్పుడు గొప్ప‌. బాహుబ‌లి త‌ర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఇంతింతై అన్న చందంగా తెలుగు సినిమా అమెరికా మార్కెట్లో ఎదిగింది. ప్ర‌స్తుత స‌న్నివేశంలో అది అమాంతం ప‌దింత‌లు పైగానే ప‌డిపోయింద‌ని అర్థ‌మ‌వుతోంది. ష‌ట్ డౌన్ లు లాక్ డౌన్ లు ఎత్తేసినా క‌రోనాకి వ్యాక్సినేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అన్న‌ది సందేహంగానే మారింది. ఇక ఇంత న‌ష్టం భ‌రించాక థియేట‌ర్ల‌ను ర‌న్ చేసే సీన్ కూడా ఉండ‌క‌పోవ‌చ్చు.. దాంతో థియేట‌ర్ల‌ ష‌ట్ డౌన్లు ఖాయ‌మ‌న్న అంచ‌నా వెలువ‌డుతోంది. ఈ మాంద్యాన్ని.. క్రైసిస్ స‌న్నివేశాన్ని వెంట‌నే అంచ‌నా వేయ‌లేక‌పోయినా .. ఒక్కో ముడి విప్పేస్తుంటే మునుముందు రిలీజ్ కి రానున్న సినిమాల‌కు క‌ష్ట కాలం దారుణంగా ఉంటుంద‌న్న అంచ‌నా వెలువ‌డుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రిలీజ్ ల‌పై స‌మ్మెట పోటు ప‌డిన‌ట్టేన‌న్న ఆందోళ‌న నిలువునా ఒణికించేస్తోంది.