Begin typing your search above and press return to search.

పాపం భీష్మ‌పై కరోనా పంచ్ అలా ప‌డింది!

By:  Tupaki Desk   |   16 March 2020 9:00 PM IST
పాపం భీష్మ‌పై కరోనా పంచ్ అలా ప‌డింది!
X
ఇంకా థియేట‌ర్ల‌లో బాగా ఆడుతున్న సినిమా ఉప్పెన వ‌ల్ల‌నో ప్ర‌కృతి వైప‌రీత్యం వ‌ల్ల‌నో అనూహ్యంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా? కానీ అలాంటి వ్య‌థ‌నే అనుభ‌విస్తోంది భీష్మ టీమ్. ఇప్ప‌టికే ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలు ఓవ‌ర్సీస్ స‌హా అన్ని చోట్లా లాభాల బాట ప‌ట్టింది. షేర్స్ అదిరిపోయాయ‌న్న టాక్ ఉంది. అయితే స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో క‌రోనా క‌ల్లోలం మొద‌లైంది. చైనా నుంచి భార‌త్ వ‌ర‌కూ క‌రోనా ద‌డ‌ద‌డ లాడిస్తోంది. ముఖ్యంగా వినోద ప‌రిశ్ర‌మ‌పై ఈ మ‌హ‌మ్మారీ పోటు మ‌రీ దారుణంగా ప‌డింది.

ప్ర‌స్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా క‌ల్లోలంపై బెంబేలెత్తిపోతున్నారు. ఎట్నుంచి ఏ ముప్పు వ‌స్తుందో అంటూ అంతా భ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో థియేట‌ర్ల బంద్ .. షూటింగుల బంద్ అంటూ సినీప‌రిశ్ర‌మ స్వ‌చ్ఛందంగా సాయానికి వ‌చ్చింది. ఇక ఉన్న‌ట్టుండి థియేట‌ర్ల‌ను బంద్ చేస్తే అప్ప‌టికే థియేట‌ర్ల‌లో ఆడుతున్న సినిమాల ప‌రిస్థితేమిటి? అన్న‌ది చూస్తే.. ప్ర‌స్తుతం థియేట‌ర్ల ముందు జ‌నం లేక క‌ళ త‌ప్పిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఇక క‌రోనా వ‌ల్ల థియేట‌ర్లు మూసేస్తే ఆ ప్ర‌భావం ముఖ్యంగా భీష్మ సినిమాపైనే ప‌డింద‌ని చెబుతున్నారు. ఏప్రిల్ వ‌ర‌కూ ఏదీ స‌రైన సినిమా లేక‌పోవ‌డంతో ఈ సీజ‌న్ అంతా ఫ్యామిలీ సినిమాగా ర‌న్ అయిపోతుంద‌ని నితిన్ తండ్రి గారు డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి ఎంతో ఆస‌క్తిగా వేచి చూశారు. అందువ‌ల్ల‌నే ఆయ‌న థియేట‌ర్ల బంద్ ని వ్య‌తిరేకించారు. కానీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఆప‌డం ఆయ‌న వ‌ల్ల కాదు క‌దా! ప్ర‌స్తుతం ఐమ్యాక్స్ స‌హా హైద‌రాబాద్ న‌గ‌రంలోని థియేట‌ర్ల‌న్నీ బంద్ అయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా థియేట‌ర్లు బంద్ అయ్యాయి. దీంతో అన్నిచోట్లా భీష్మ‌కు పంచ్ ప‌డిపోయింది. ఒక ర‌కంగా చాలా పెద్ద మొత్తంలోనే షేర్ ని భీష్మ న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. దాంతో పాటే ఆడుతున్న ఇత‌ర సినిమాల‌కు కూడా ఇదే ప‌రిస్థితి. ఏదీ తోపులాంటి సినిమా లేక‌పోయినా క‌రోనా ఇలాంటి ముప్పు తెస్తుంద‌న్న‌ది భీష్మ టీమ్ గ్ర‌హించ‌లేని టాస్క్. ఇక‌ ఈనెల 31 వ‌ర‌కూ థియేట‌ర్లు తెర‌వ‌క పోతే ఆ మేర‌కు ప‌రిశ్ర‌మ తీవ్రంగానే న‌ష్ట‌పోనుంది. క‌రోనా క‌ల్లోలం త‌గ్గితే ఈనెల 21 నుంచి అంటే మ‌రో ఐదారు రోజుల్లోనే థియేట‌ర్ల‌ను ఓపెన్ చేస్తార‌న్న ఆశ అయితే నిర్మాత‌లు - ఎగ్జిబిట‌ర్ల‌లో క‌నిపిస్తోంది.