Begin typing your search above and press return to search.

'బీస్ట్' టైటిల్ పై వివాదం.. విజయ్ కు భాషాభిమానం లేదా..?

By:  Tupaki Desk   |   25 Jun 2021 3:30 AM GMT
బీస్ట్ టైటిల్ పై వివాదం.. విజయ్ కు భాషాభిమానం లేదా..?
X
తమిళనాడు ప్రభుత్వం తమిళ భాషాభివృద్ధికి కృషి చేస్తుంది. దీని కోసం కేంద్రంతో అనేకసార్లు ఫైట్ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు ఇతర సంస్థలకు తమిళ పేర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. తమిళ భాషాభివృద్ధిలో భాగంగా కోలీవుడ్ లో రూపొందే సినిమాలకు తమిళ టైటిల్స్ పెడితే.. ఆ చిత్రాలకు ఎన్నో రాయితీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ఫిలిం మేకర్స్ అందరూ తమ సినిమాలకు ఎక్కువగా తమిళ టైటిల్ పెట్టడానికే మొగ్గుచూపుతుంటారు.

గతంలో రజినీకాంత్ - శంకర్ కాంబోలో వచ్చిన 'రోబో' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసినా.. తమిళ వెర్షన్ కి మాత్రం ''ఎంథిరన్'' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కోలీవుడ్ లో ఇంగ్లీష్ టైటిల్స్‌ సంస్కృతి మళ్ళీ ఊపందుకుంటోంది. కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ ఈ ఏడాది సంక్రాంతికి ''మాస్టర్'' అనే ఇంగ్లీష్ టైటిల్ తో తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాని విడుదల చేశారు. ఈ క్రమంలో తన లేటెస్ట్ మూవీకి కూడా ''బీస్ట్'' అనే ఇంగ్లీష్ టైటిల్ నే ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలో తమిళ భాషాభిమానులు విజయ్ సినిమాల టైటిల్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండు సినిమాలకు ఆంగ్ల టైటిల్స్ పెట్టడంతో విజయ్ కు తమిళ భాష పై అభిమానం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. విజయ్ తన 65వ చిత్రానికి 'బీస్ట్' అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టడంపై పలువురు రాజకీయ నేతలు.. భాషా పండితులు విమర్శలు చేస్తున్నారు. విజయ్ లాంటి అగ్ర హీరో భాషాభివృద్ధికి కృషి చేయకుండా, ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఏంటని వీసీకే వంటి పలు రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి 'బీస్ట్‌' టైటిల్ వివాదంపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.