Begin typing your search above and press return to search.

కనెక్ట్ ట్రైలర్: గుండె ధ‌డేల్! ఆత్మ‌లు శ‌బ్ధాలు చేస్తాయా?

By:  Tupaki Desk   |   9 Dec 2022 6:47 AM GMT
కనెక్ట్ ట్రైలర్: గుండె ధ‌డేల్! ఆత్మ‌లు శ‌బ్ధాలు చేస్తాయా?
X
నయనతార ప్రధాన పాత్రలో న‌టించిన హారర్ థ్రిల్లర్ 'క‌నెక్ట్' డిసెంబర్ 22న థియేటర్ లలో ఘ‌నంగా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆన్ లైన్ లో ఆవిష్కరించారు. డార్లింగ్ ప్ర‌భాస్ చేతుల‌మీదుగా ఆవిష్కృత‌మైన ఈ ట్రైల‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.

ట్రైల‌ర్ ఆద్యంతం ఒళ్లు గ‌గుర్పొడిచే హార‌ర్ థ్రిల్స్ క‌ట్టి ప‌డేసాయంటే అతిశ‌యోక్తి కాదు. సుసాన్ (నయనతార) ఒక చిన్న అందమైన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గ‌డిపే ఇల్లాలు. కానీ భార‌త‌దేశంలో ఆక‌స్మిక‌ లాక్ డౌన్ సమయంలో ఆమె తన ఏకైక గారాల‌ కుమార్తె ప్రవర్తనలో అనూహ్య‌ మార్పును చూసి కంగారు ప‌డుతుంది.

వేరే ఆప్ష‌న్ లేని ప‌రిస్థితిలో సుసాన్ తన కుమార్తెకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి భూతవైద్యుని (అనుపమ్ ఖేర్) సహాయం కోరుతుంది. తన కూతుర్ని మళ్లీ మామూలుగా చేయడంలో విజయం సాధించిందా?.. లేదా? అన్న‌దానికి సమాధానం తెలియాలంటే థియేట‌ర్ల‌లో సినిమా వీక్షించాల్సిందే. హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు కెమెరా పనితనం- రీరికార్డింగ్ తోనే ఎక్కువ ప‌ని. ఈ రెండు విభాగాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. రీరికార్డింగ్ ఈ సినిమాకి ప్ల‌స్ కానుంది.

లాక్ డౌన్ కు 24 గంటల ముందు జ‌రిగే క‌థ‌లో చాలా ట్విస్టుల‌తో ఈ సినిమా కొన‌సాగుతుంద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయితే నయన్ కుమార్తెకు దెయ్యం పట్టడం అనే ఎలిమెంట్ ఇంట్రెస్ట్ ని పెంచింది. భారీ తారాగ‌ణంతో ప‌ని లేకుండా ఇంట్లోనే నిశీధి నుంచి శ‌బ్ధాలు వినిపిస్తుంటే అక్క‌డ ఏదో జ‌రుగుతోంద‌నే థ్రిల్ ని క‌లిగించేలా స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేసిన తీరు ఆస‌క్తిక‌రం.

అస‌లు మ‌నుషుల‌కు ఆత్మ‌ల‌కు ఆ శ‌బ్ధాల‌కు లింకేంటో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. ఈ మూవీ కాస్త డార్క్ షేడ్ విజువల్స్ తో మ‌న‌సుల‌పై ఘాడ‌మైన ముద్ర వేస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ చిత్రంలో వినయ్ రాయ్- హనియా నఫీషా- సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. ఇది 99 నిమిషాల పాటు సాగే హార‌ర్ థ్రిల్ల‌ర్. డిసెంబర్ 22న కనెక్ట్ విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.