Begin typing your search above and press return to search.

సినిమా షూటింగ్స్ బంద్ పై ఇండస్ట్రీలో గందరగోళం..!

By:  Tupaki Desk   |   3 Aug 2022 5:30 AM GMT
సినిమా షూటింగ్స్ బంద్ పై ఇండస్ట్రీలో గందరగోళం..!
X
ఆగస్ట్ 1వ తారీఖు నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ చేసిన సంగతి తెలిసిందే. చిత్రీకరణలు నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకోగా.. దీనికి ఫిల్మ్ ఛాంబర్ మద్ధతు తెలిపింది. టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమస్యల నేపథ్యంలో సమావేశాల ద్వారా వాటికి పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ పెద్దలు తెలిపారు. అయితే షూటింగ్స్ నిలిపివేయడం పై గందరగోళం నెలకొంది.

తెలుగు ఫిలిం చాంబర్ మరియు గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు మేకర్స్ సోమవారం నుంచి తమ సినిమా షూటింగ్స్ ను యధావిధిగా కొనసాగించారు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'వారసుడు' సినిమా చిత్రీకరణ జరుపుకుంది.

అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి మరియు ధనుష్ కాంబోలో రానున్న 'సార్' సినిమా షూటింగ్ కూడా జరిగింది. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు ఈ వ్యవహరంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. సమస్యల పరిష్కారం దిశగా బంద్ కు పిలుపునిస్తే.. షూటింగ్స్ ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ రెండు తమిళ చిత్రాలు కాబట్టి షూటింగులు చేసుకోవచ్చని దిల్ రాజు అన్నారు. తాము చెప్పింది కేవలం తెలుగు సినిమా షూటింగ్‌ల బంద్ అని.. ఇతర భాషల సినిమా షూటింగులు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. అయితే అవి రెండూ బైలింగ్విల్ సినిమాలు కదా.. తెలుగులోనూ రిలీజ్ చేస్తారు కదా? పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్ పార్కింగ్ స్థలంలో స్టార్ హీరో అల్లు అర్జున్ కారు కనిపించడంతో.. ఆయన ఏదైనా షూటింగ్ లో పాల్గొంటున్నాడా అనే చర్చ మొదలైంది. వాస్తవానికి బన్నీ గత కొన్ని రోజులుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బంద్ తర్వాతా షూటింగ్ చేస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే నిజమైతే సినిమా షూటింగ్స్ చేయకూడదని ఆదేశించినప్పుడు.. సినిమా వాళ్ళు యాడ్స్ షూట్ చేయడానికి అనుమతిస్తారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అంతేకాదు తమిళ సినిమాలు మరియు యాడ్స్ షూటింగులకు ఇక్కడి సినీ కార్మికులే పని చేస్తుంటారు. అలాంటప్పుడు కేవలం కొన్ని సినిమాలకు వర్క్ చేసేవారినే ఇబ్బంది పెట్టడం ఏంటనే విషయాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు.

సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నందున షూటింగులు నిలిపివేయాలని తెలుగు ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది. అందరం కలసి మాట్లాడుకుంటామని, పరిష్కారం దొరికే వరకూ షూటింగ్స్ తిరిగి మొదలు పెట్టబోమని నిర్మాత దిల్ రాజు మరియు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.

కొత్త సినిమాలే కాదు.. చిత్రీకరణ చివరి దశలో ఉన్న చిత్రాల షూటింగ్ లను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. కాకపోతే తెలుగులో రిలీజ్ కానున్న ఇతర భాషల సినిమాల షూటింగులు యధావిధిగా జరుగుతుండటం.. టాలీవుడ్ సినీ కార్మికులే వాటిల్లో వర్క్ చేస్తుండటం వంటివి ఇండస్ట్రీలో గందరగోళ పరిస్థితులను సృష్టించాయి. ఏదేమైనా వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.