Begin typing your search above and press return to search.

'సలార్' రీమేకా కాదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందిగా..!

By:  Tupaki Desk   |   12 Feb 2021 8:00 PM IST
సలార్ రీమేకా కాదా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందిగా..!
X
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ - 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖని - రామగుండం ప్రాంతాల్లో జరిగింది. అయితే 'సలార్' ఫస్ట్ లుక్ మరియు సెట్స్ లో ప్రభాస్ లుక్ చూసిన సినీ అభిమానులందరూ ఇది ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ 'ఉగ్రమ్' సినిమాకి రీమేక్ అయ్యుండొచ్చని డిస్కషన్ చేసుకున్నారు.

అయితే ఈ మధ్య ప్రశాంత్ నీల్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ ''సలార్ రీమేక్ అని వస్తున్న వార్తా కథనాలను నేను కూడా చదివాను. ఇది నా మునుపటి చిత్రం ఉగ్రమ్ యొక్క రీమేక్ కాదు. ఇది ఏ హాలీవుడ్ లేదా బాలీవుడ్ హిట్ సినిమా ఆధారంగా తీయడంలేదు. నా ఒరిజినల్ ఐడియాతో ప్రభాస్ కోసం ఈ కథ ప్రత్యేకంగా రాసుకున్నాను'' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇది రీమేక్ కాదని క్లారిటీ వచ్చినట్లైంది. అయితే తాజాగా 'సలార్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బాస్రుర్ స్టేట్మెంట్ కారణంగా మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది.

కన్నడ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి బాస్రుర్ మాట్లాడుతూ 'కేజీఎఫ్' సినిమాకి ఇచ్చినటట్లే మంచి మ్యూజిక్ ఇస్తావా అని ప్రభాస్ అడిగాడని.. నేను ఇస్తాను అని చెప్పానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ''ఇది ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'ఉగ్రమ్' సినిమాకు రీమేక్ అని తెలిసిందే కదా'' అని అనడంతో 'సలార్' ఒరిజినల్ స్టోరీనా లేదా రీమేకా అనే కన్ఫ్యూజన్ మొదలైంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.