Begin typing your search above and press return to search.

బాలయ్యది ముహూర్తమా ముందుజాగ్రత్తా ?

By:  Tupaki Desk   |   7 May 2019 5:15 AM GMT
బాలయ్యది ముహూర్తమా ముందుజాగ్రత్తా ?
X
ఎన్నో ఆశలతో తెలుగు సినిమా చరిత్రలో మరపురాని స్థాయిలో నిలిచిపోతుందనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం బాలయ్యకు ఇప్పటికీ అంతుచిక్కనిదే. కనీస స్థాయిలో ఆడకపోగా కెరీర్లోనే బెస్ట్ డిజాస్టర్ గా నిలవడం అభిమానులు సైతం త్వరగా జీర్ణం చేసుకోలేకపోయారు. సరే హీరో అన్నాక ఇలాంటివి మామూలే కాబట్టి వీలైనంత త్వరగా వాటిని మర్చిపోయి రంగంలోకి దూకాలి. బాలకృష్ణ అదే పని మీదున్నారు.

బోయపాటి శీనుతో చేస్తారనే అంచనాలకు భిన్నంగా కెఎస్ రవికుమార్ ను లైన్ లోకి తెచ్చిన బాలయ్య దీని షూటింగ్ ని ఈ నెల 17న మొదలుపెట్టబోతున్నారు. ఈ మేరకు డేట్ ఫిక్స్ అయ్యిందని తెలిసింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానుండగా అంత త్వరగా స్టార్ట్ చేసే అవసరం ఏముందనే సందేహం రావొచ్చు

నందమూరి కాంపౌండ్ నుంచి అందిన సమాచారం మేరకు అది మంచి ముహూర్తం కావడం వల్లే బాలయ్య 17 డేట్ వైపు మొగ్గు చూపారట. హిందూపురం నుంచి సిట్టింగ్ ఎమెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ విజయం మీద ధీమా ఉన్నాడు కాబట్టి అదేదో గెలిచాక గ్రాండ్ గా షూటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే రాజకీయాలను సినిమాలను బాలయ్య సహజంగా ముడిపెట్టడు. అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఫలితం వస్తే కొంత ఇబ్బందిగా మీడియాను ఫేస్ చేయాల్సి ఉంటుందని కాబట్టి ఇలా కూడా అలోచించి ఉండవచ్చని ఓ వర్గం అంటోంది. ఇందులో బాలయ్య చాలా గ్యాప్ తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. లెజెండ్ విలన్ జగపతి బాబు కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది