Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ హీరోపై క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు.. రైతుల‌ను వేధిస్తున్నార‌ని..

By:  Tupaki Desk   |   14 March 2021 2:30 PM GMT
కేజీఎఫ్ హీరోపై క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు.. రైతుల‌ను వేధిస్తున్నార‌ని..
X
కేజీఎఫ్ ఘ‌న విజ‌యంతో క‌న్న‌డ హీరో య‌శ్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది. అయితే.. తాజాగా య‌శ్‌, అత‌ని కుటుంబ స‌భ్యులు రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఏకంగా క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు అంద‌డంతో ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు.

క‌ర్నాట‌క‌లోని హాస‌న్ జిల్లా య‌శ్ త‌ల్లి సొంత గ్రామం. ఇటీవ‌ల హాస‌న్ ప్రాంతానికి స‌మీపంలోని తిమ్మాపుర‌లో 80 ఎక‌రాల భూమిని కొనుగోలు చేసింది య‌శ్ ఫ్యామిలీ. ఇక్క‌డి వ‌ర‌కూ ఎలాంటి వివాద‌మూ లేదు. కానీ.. ఆ భూమి చుట్టూ ప్ర‌హ‌రీ తిప్ప‌డం ద్వారానే స‌మ‌స్య మొద‌లైంది.

ఇలా ప్ర‌హ‌రీ నిర్మించ‌డం వ‌ల్ల త‌మ భూముల‌కు దారిలేకుండా పోయింద‌ని ఇత‌ర రైతులు ఆందోళ‌న‌కు దిగారు. గ్రామాల్లో పొలాల‌కు ఏ విధంగా వెళ్తారో తెలిసిందే. ఒక‌రి పొలంలో నుంచి మ‌రొక‌రు వెళ్తుంటారు. అయితే.. ఇప్పుడు య‌శ్ కుటుంబం దారి మూసేయ‌డంతో రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో య‌శ్ త‌ల్లి పుష్ప‌ల‌త‌తో గొడ‌వకు సైతం దిగారు. ఆ త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు

తాజాగా.. అక్క‌డి రాజ్య రైతు సంఘం అధ్య‌క్షుడు అణ్ణాజ‌ప్ప హాస‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ కు ఈ విష‌య‌మై ఫిర్యాదు చేశారు. ఇటీవ‌ల కొనుగోలు చేసిన భూమిలో అక్ర‌మంగా ప్ర‌హ‌రీ నిర్మించార‌ని, ప్ర‌శ్నించిన రైతుల‌ను బెదిరిస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతుల‌కు న్యాయం చేయాల‌ని కోరారు.