Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కు షాక్...హెచ్ ఆర్ సీలో ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   25 Aug 2018 9:44 AM GMT
బిగ్ బాస్ కు షాక్...హెచ్ ఆర్ సీలో ఫిర్యాదు!
X
గ‌త ఏడాది తెలుగులో ప్రారంభ‌మైన బిగ్ బాస్ షో....పెద్ద‌గా వివాదాల‌కు తావివ్వ‌కుండా ముగిసిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, బిగ్ బాస్ సీజ‌న్ -2లో ఏమైనా జ‌ర‌గొచ్చంటూ....నాని చెప్పినట్లుగానే ఏదేదో జ‌రిగిపోతోంది. ఈ సీజ‌న్ ముగింపున‌కు వ‌స్తోన్న త‌రుణంలో మ‌సాలా డోస్ ఎక్కువ‌వుతోంది. గీతా మాధురికి కిస్సింగ్ టాస్క్ పై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో తాజాగా బిగ్ బాస్ కు మ‌రో షాక్ త‌గిలింది. ఈ షో వ‌ల్ల‌ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్‌ సీ)లో ఫిర్యాదు న‌మోదైంది. 16 మందిని ఒకే ఇంట్లో నిర్బంధించి వెకిలి చేష్టలకు పాల్ప‌డుతున్నార‌ని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్క‌ర్ .... హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేశారు. ఈ షో ....మహిళలను కించబ‌రిచేలా ఉంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షో వల్ల సమాజానికి ఉపయోగం లేదని అన్నారు.

బిగ్ బాస్ -2లో మ‌సాలా శృతి మించుతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆ షోపై హెచ్ ఆర్ సీలో ఫిర్యాదు న‌మోదైంది. కేవలం డ‌బ్బుకోసం...., టీఆర్ పీ రేటింగుల కోసం చానెల్ యాజమాన్యాలు ఈ షోలను ప్రసారం చేస్తున్నాయని భాస్క‌ర్ ఆరోపించారు. చిత్రవిచిత్ర ఆదేశాలతో కంటెస్టెంట్ల‌ను బిగ్ బాస్ హింసిస్తున్నారని ఆరోపించారు. బాత్రూములు కడగ‌డం....వంటి పిచ్చి టాస్క్ ల‌తో హౌజ్ మేట్ల‌ను బానిసల్లా చూస్తున్నారని ఆరోపించారు. ఈ షో పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయ‌న‌ పేర్కొన్నారు. ఈ షోలో కంటెస్టెంట్ల‌ను ఒకే ఇంట్లో బంధించి బయటకు రానివ్వక‌పోవ‌డం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఈ షో వ‌ల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెళుతున్నాయని తెలిపారు. ఈ షో చూస్తోన్న ప్రేక్ష‌కులు కూడా ఉద్రేకానికి - మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉందని, వెంట‌నే ఈ షోను నిలిపి వేయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.