Begin typing your search above and press return to search.

బాహుబలి వెర్సస్ దంగల్.. అవసరమా?

By:  Tupaki Desk   |   1 Jun 2017 8:43 AM GMT
బాహుబలి వెర్సస్ దంగల్.. అవసరమా?
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా గుర్తింపు సంపాదించింది. ఇది బేసిగ్గా తెలుగు సినిమా అయినప్పటికీ.. తమిళం.. హిందీ.. మలయాళం అని భాషతో సంబంధం లేకుండా.. ప్రాంతం పట్టింపు లేకుండా దేశమంతా ఇరగాడింది. దీన్ని తెలుగు సినిమాగా ముద్ర వేసి.. తమ సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్ల మార్కును దాటలేదని బాలీవుడ్ వాళ్లు తెగ ఫీలైపోవాలా? అలాగే మా రీజనల్ సినిమా వెయ్యి కోట్లు సాధించింది.. మరి దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న మీ సినిమాల మాటేంటి అని మన వాళ్లు ఎగెరిగిరి పడాలా? ఇందులో ఏది జరిగినా తప్పే. కానీ గత కొన్ని రోజులుగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో ఇలాంటి వాదోపవాదాలే జరిగాయి.

‘బాహుబలి-2’ ప్రభంజనం కొనసాగుతూ.. ఈ చర్చ కొనసాగుతుండగానే ‘దంగల్’ చైనాలో విడుదలైంది. అక్కడ అనూహ్యమైన వసూళ్లు సాధించింది. బాహుబలి-2 వసూళ్లను కూడా ఆ సినిమా దాటేసింది. అది బాలీవుడ్ వాళ్లకు పెద్ద ఆయుధంగా మారింది. చూశారా హిందీ సినిమా తడాఖా.. ‘బాహుబలి’లో మాదిరి ఏ భారీతనం.. అదనపు హంగులు లేకుండా కేవలం కంటెంట్ తోనే ఇంత పెద్ద సక్సెస్ సాధించాం.. నెంబర్ వన్ స్థానాన్ని కొల్లగొట్టేశాం అంటూ వాళ్లిప్పుడు విర్రవీగిపోతున్నారు. బాహుబలి-2ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఐతే బాహుబలి-2.. దంగల్ రెండూ కూడా ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమా కీర్తి పతాకాన్ని ఎగరవేసినవే. మనం గర్వించేలా చేసినవే. ఇండియన్ సినిమాకు కొత్త మార్కెట్లను చూపించినవే. వీటిని స్ఫూర్తిగా తీసుకుని.. మన సినిమాల పరిధిని ఎలా పెంచుకోవాలో.. ఇంకా మంచి సినిమాలు ఎలా తీయాలో ఆలోచించాల్సింది పోయి.. మీరు గొప్పా.. మేం గొప్పా అని వాదులాడుకోవడం దేనికి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/