Begin typing your search above and press return to search.

మళ్లీ వచ్చేస్తున్న ‘కార్తికేయ’.. మొద‌లు కానున్న సీక్వెల్‌.. బాక్సాఫీస్ షేకేనా?

By:  Tupaki Desk   |   7 March 2021 12:30 PM GMT
మళ్లీ వచ్చేస్తున్న ‘కార్తికేయ’.. మొద‌లు కానున్న సీక్వెల్‌.. బాక్సాఫీస్ షేకేనా?
X
సినిమా అనేది చాలా మందికి వ్యాపారం.. కానీ, అతి కొద్దిమందికి ప్యాష‌న్‌. తాము క‌న్న క‌ల‌కు ప్రాణంపోసి సెల్యులాయిడ్ పై అద్వితీయంగా ఆవిష్క‌రించేందుకు ప్రాణం పెడ‌తారు. వాళ్లు సొల్లు కామెడీ సీన్లు, ఘాటు రొమాన్సును న‌మ్ముకునే ర‌కం కాదు. వాళ్లు అదోర‌కం! త‌మపై, త‌మ‌ క‌థపైనే విశ్వాసం ఉంచి, రొటీన్ కు దూరంగా జ‌రిగిపోయే మ‌రో ర‌కం! అలాంటి వారిలో ఒక‌రు ద‌ర్శ‌కుడు చందు మెండేటి.

హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో.. చందు రూపొందించిన చిత్రం ‘కార్తికేయ‌’. 2014లో వచ్చిన ఈ మూవీ ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. రొటీన్ భిన్నంగా వ‌చ్చిన ఈ సినిమా ఆడియ‌న్స్ ను అబ్బుర ప‌రిచింది. అప్ప‌టి వ‌ర‌కూ ఒక ఒర‌వ‌డిలో న‌డిచిన సిద్ధార్థ్ కు ఈ చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇంత కాలం త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

‘కార్తికేయ‌-2’ పేరుతో రాబోతున్న ఈ సినిమా షూట్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మొదలు కాబోతోంది. తొలి షెడ్యూల్ ను గుజరాత్ లోని ద్వారకా నగరంలో మొదలు పెట్టబోతున్నారని సమాచారం. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఓ అంతుచిక్కని రహస్యాన్ని బేస్ చేసుకొని, సరికొత్త థ్రిల్లింగ్ పాయింట్ తో తెరకెక్కబోతోందీ చిత్రం.

ఈ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ నటించబోతుండడం విశేషం. ఇందులో ధన్వంతరి అనే పాత్రలో ఆయ‌న‌ కనిపించబోతున్నారు. ఈ విష‌యాన్ని యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. మంచి విజ‌యం సాధించిన కార్తికే చిత్రానికి సీక్వెల్ రాబోతుండ‌డంతో.. మ‌రింత థ్రిల్ అవుతున్నారు ఆడియ‌న్స్‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.