Begin typing your search above and press return to search.

కామెడీకి కేరాఫ్ అడ్రెస్ .. రాజేంద్రప్రసాద్ (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   19 July 2021 3:41 AM GMT
కామెడీకి కేరాఫ్ అడ్రెస్ .. రాజేంద్రప్రసాద్ (బర్త్ డే స్పెషల్)
X
తెలుగు తెరపై సందడి చేసిన హాస్యనటులు ఎందరో ఉన్నారు. కస్తూరి శివరావు .. రేలంగి .. రమణారెడ్డి .. రాజబాబు .. పద్మనాభం .. అల్లు రామలింగయ్య హాస్యనటులుగా తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే అప్పట్లో హాస్యమనేది కథలో ఒక భాగంగా మాత్రమే ఉండేది. ఆ తరువాత హాస్యరసం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హాస్యమే ప్రధానంగా సినిమాలు రావడం మొదలైంది. అలా హాస్య ప్రధానమైన కథల ద్వారా కథానాయకుడిగా తెలుగు తెరపై తమ జోరు చూపించినవారిలో రాజేంద్రప్రసాద్ ముందువరుసలో కనిపిస్తారు.

మొదటి నుంచి కూడా రాజేంద్రప్రసాద్ లో సమయస్ఫూర్తి .. చురుకుదనం ఎక్కువ. ఆయన మనసంతా నటనపైనే ఉండేది. అందువలన చదువు పూర్తయిన తరువాత చెన్నై లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి, నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తరువాత సినిమాల్లో ప్రయత్నాలు ఆరంభించారు. 'స్నేహం' అనే సినిమాతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. 'మూడుముళ్ల బంధం' సినిమా నుంచి ఆయనకి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఓ ఎనిమిదేళ్ల పాటు కేరక్టర్ ఆర్టిస్ట్ గానే ఆయన కొనసాగుతూ వచ్చారు.

ఒకానొక సమయంలో ఇక కథానాయకుడిగా తన అదృష్టం పరీక్షించుకోవాలని రాజేంద్రప్రసాద్ ఒక నిర్ణయానికి వచ్చారు.
ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, తన మనసులో మాటను బయటపెట్టారట. ప్రస్తుతం ఉన్న హీరోలు ఒక్కో విషయంలో ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఎవరూ ట్రై చేయని రూట్లో వెళితే రాణించవచ్చని ఆయన సలహా ఇచ్చారట. దాంతో ఆ విషయాన్ని గురించి బాగా ఆలోచన చేసిన రాజేంద్రప్రసాద్, హాస్యాన్ని ఆయుధంగా చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆ దిశగా అడుగులువేస్తూ వెళ్లారు.  

అలా 'ప్రేమించు పెళ్లాడు' సినిమాతో ఆయన కథానాయకుడిగా మారిపోయారు. అప్పటి నుంచి ఆయన ఒక వైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున కథానాయకుడి పాత్రలపై దృష్టిపెడుతూ ముందుకు వెళ్లారు. అలా ఆయన 'రెండు రెళ్ల ఆరు' .. 'అహ నా పెళ్లంట' .. 'ముత్యమంత ముద్దు' సినిమాలతో హాస్య కథానాయకుడిగా నిదానంగా కుదురుకున్నారు. 90 వ దశకంలో రాజేంద్ర ప్రసాద్ హాస్య కథానాయకుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు .. విజయాలను అందుకున్నారు. ఈ సమయంలో ఆయన ఏడాదికి అరడజను సినిమాలకి పైగా చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఏప్రిల్ 1 విడుదల .. లేడీస్ టైలర్ .. అప్పుల అప్పారావు .. మాయలోడు .. ఆ ఒక్కటీ అడక్కు .. కొబ్బరి బొండాం .. పెళ్లి పుస్తకం .. రాజేంద్రుడు - గజేంద్రుడు సినిమాలు రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ గ్రాఫ్ ను రాకెట్ వేగంతో పెంచేశాయి. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు తెచ్చేవిగా రాజేంద్రప్రసాద్ సినిమాలు మారిపోయాయి. రాజేంద్రప్రసాద్ సినిమాలంటే 100 పర్సెంట్ హాయిగా నవ్వుకోవచ్చనే నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడిపోయింది. వంశీ .. ఈవీవీ ... రేలంగి నరసింహారావు .. ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులు ఆయన క్రేజ్ ను మరింతగా పెంచుతూ వెళ్లారు.

రాజేంద్రప్రసాద్ కి నవ్వించడమే కాదు .. బరువైన పాత్రలతో కన్నీళ్లు పెట్టించడం కూడా తెలుసు. ఎర్ర మందారం .. ఆ నలుగురు .. మీ శ్రేయోభిలాషి .. ఓనమాలు .. సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఫుల్ బిజీ. అయినా ఇప్పటికీ కూడా ఆయన ప్రధానమైన పాత్రగా తోలుబొమ్మలాట .. గాలి సంపత్ వంటి సినిమాలు అడపా దడపా వస్తున్నాయంటే, ప్రేక్షకులు ఆయనను ఎంతగా అభిమానిస్తున్నారో .. ఆయన నటనను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.