Begin typing your search above and press return to search.

కమల్ పై చిత్రమైన ఆరోపణ..కెరీర్ ను నాశనం చేశాడు!

By:  Tupaki Desk   |   10 April 2019 3:52 PM IST
కమల్ పై చిత్రమైన ఆరోపణ..కెరీర్ ను నాశనం చేశాడు!
X
ఒకవైపు రాజకీయంలో తనమునకలై ఉన్న తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ పై ఒకింత చిత్రమైన ఆరోపణ చేశాడు అదే భాషకు చెందిన ప్రముఖ కమేడియన్ వివేక్. అనేక అనువాద సినిమాలతో వివేక్ తెలుగునాట కూడా కొంత గుర్తింపును కలిగి ఉన్నాడు. మంచి టైమింగ్ ఉన్న ఈ కమేడియన్ స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. అంతే కాదు.. ఒక దశలో హీరోగా కూడా ట్రై చేశాడు.

వివేక్ తమిళంలో హీరో స్థాయి పాత్రల్లో చేసిన పలు సినిమాలు తెలుగులో రీమేక్ అయినప్పుడు ఆ పాత్రలను ఇక్కడ ప్రముఖ హీరోలే చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే వివేక్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.

కమేడియన్ గా స్టార్ అయినా హీరోగా సక్సెస్ కాలేకపోవడం మీదే వివేక్ బాధంతా ఉంది. దాన్నే ఇప్పుడు వెల్లగక్కాడు. తన కెరీర్ ను కమల్ హాసన్ నాశనం చేశాడంటూ ఒక చిత్రమైన ఆరోపణ చేశాడితను. అదేంటి? అంటే అదో చిత్రమైన కథ.

ఆ మధ్య కమల్ హాసన్ ‘పాపనాశమ్’ సినిమా విడుదల అయ్యింది కదా, మలయాళీ ‘దృశ్యం’ సినిమా రీమేక్ అది. అది విడుదల అయ్యే ముందు వివేక్ సినిమా కూడా ఒకటి విడుదల అయ్యిందట. కమల్ సినిమా వచ్చి థియేటర్లను పూర్తిగా ఆక్రమించేసి వివేక్ హీరోగా నటించిన సినిమాకు థియేటర్లు లేకుండా చేసిందట. దీంతో వివేక్ సినిమా ఫ్లాప్ అయ్యిందట. అలా కమల్ తన కెరీర్ ను నాశనం చేశాడంటున్నాడు వివేక్. వినడానికి ఈ ఆరోపణ చిత్రంగానే ఉంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలు దెబ్బ తింటూ ఉంటాయి. అందుకే టైమ్ చూసుకుని విడుదల చేసుకోవాలంటారు!