Begin typing your search above and press return to search.

కమెడియన్ పృథ్వీ అలా ఫూల్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   12 Dec 2016 6:29 AM GMT
కమెడియన్ పృథ్వీ అలా ఫూల్ అయిపోయాడు
X
కొంచెం ఒడ్డూ పొడుగూ ఉన్న వాళ్లను చూసి సినిమా హీరోలా ఉన్నావని.. సినిమాల్లో ట్రై చేస్తే పైకొస్తావని అనడం మామూలే. ఐతే మామూలు వాళ్లు ఈ మాట అంటే ఓకే కానీ.. సినిమా వాళ్లెవరైనా ఈ విషయంలో కితాబిచ్చి.. వచ్చేయ్ చూసుకుందాం అంటే ఎవరైనా టెంప్ట్ అవక మానరు. కమెడియన్ పృథ్వీ కూడా ఇలాగే టెంప్ట్ అయిపోయాడట. కానీ చివరికి తనకు చేదు అనుభవం ఎదురైందని అంటున్నాడు పృథ్వీ. సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి యథాలాపంగా అన్న మాటలు నమ్మేసి తాను ఎలా చెన్నైకి చెక్కేసింది ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు పృథ్వీ.

‘‘డిగ్రీ తర్వాత నేను ఆంధ్రా యూనివర్శిటీలో ఎంయే చేరాను . క్లాసులు పూర్తవగానే సరదాగా బీచ్‌ కి వెళ్లేవాళ్లం. అలా తీరంలో ఓసారి ‘అభిలాష’ షూటింగ్‌ జరుగుతుంటే చిరంజీవి గారిని చూశా. ఆ తరవాత కూడా అడపాదడపా షూటింగులు చూసేవాడిని. ఆ వాతావరణం చూసినప్పుడల్లా ఆ రంగంపైన తెలీకుండానే ఇష్టం పెరుగుతూ వచ్చింది. నేను కాలేజీలో సాంస్కృతిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వార్షికోత్సవ వేడుక నిర్వహించారు. మా నాన్న ద్వారా నాకు ప్రభాకర్‌ రెడ్డిగారితో కాస్త పరిచయం ఉండటంతో ఆయన్ని వేడుకకు అతిథిగా రమ్మని అడిగా. ఆయన వచ్చారు. వెళ్తూ వెళ్తూ.. ‘నీ ఎత్తు.. ఫీచర్స్‌.. బాడీ లాంగ్వేజ్‌ సినిమాలకు బాగా సరిపోతాయి. పీజీ పూర్తయ్యాక చెన్నై వచ్చేయ్‌’ అన్నారు. ఆ మాటలు నమ్మేసి నేను నిజంగానే చదువయ్యాక నేరుగా చెన్నై రైలెక్కేశా. ప్రభాకర్‌ రెడ్డిగారిని కలిస్తే.. సందర్భాన్ని బట్టి లక్ష చెప్తాం.. ఆ మాటల్ని పట్టుకొని వచ్చేయడమేనా. ఇంత అమాయకుడివి ఎలా పైకొస్తావయ్యా.. అంటూ చిన్న క్లాస్‌ తీసుకున్నారు. అలా నేను ఫూల్ అయిపోయాను. ఐతే వెంటనే తిరిగి పంపించలేక.. ఏదో ఒకటి చూద్దాంలే అని అక్కడే ఉండమన్నారు. తర్వాత ఓ హోటల్లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇప్పించారు. తర్వాత అనేక ఇబ్బందులు పడి సినిమా అవకాశాలు దక్కించుకున్నా’’ అని పృథ్వీ తెలిపాడు.