Begin typing your search above and press return to search.

హాస్య‌న‌టుడు కొండ‌వ‌ల‌స హ‌ఠాన్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   3 Nov 2015 1:07 AM IST
హాస్య‌న‌టుడు కొండ‌వ‌ల‌స హ‌ఠాన్మ‌ర‌ణం
X
టాలీవుడ్ హాస్య‌న‌టుడు కొండ‌వ‌ల‌స ఇక లేరు. ఐతే ఓకే.. అంటూ త‌న‌దైన ఆహార్యంతో - శ్రీ‌కాకుళం యాస‌తో ఆక‌ట్టుకున్న కొండ‌వ‌ల‌స ఇహ‌లోకం వీడి వెళ్లారు. ఈరోజు ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. అత‌డి మ‌ర‌ణానికి కార‌ణం ఏంటి? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.

కొండ‌వ‌ల‌స పూర్తి పేరు కొండ‌వ‌ల‌స ల‌క్ష్మ‌ణ‌రావు. ఆగస్టు 10, 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. ఆరంభం వైజాగ్ పోర్ట్‌లో గుమాస్తా ఉద్యోగం చేశారు. అదే టైమ్‌లో నాట‌క రంగంలో కొన‌సాగారు. రంగ స్థ‌ల క‌ళాకారుడిగా వేలాది నాట‌కాల్లో ఆయ‌న న‌టించారు. స్టేజీ న‌టుడిగా పాపుల‌ర్ అయిన క్ర‌మంలోనే అత‌డికి సినిమా అవ‌కాశాలొచ్చాయి. వంశీ ద‌ర్శ‌కత్వంలో ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు చిత్రంతో క్యారెక్ట‌ర్ న‌టుడిగా తెరంగేట్రం చేశారు. మొద‌టి సినిమాతోనే త‌న‌దైన మార్కుతో కొండ‌వ‌ల‌స ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. దాదాపు 300 సినిమాల్లో న‌టించారాయ‌న‌.

ఎవ‌రే అత‌గాడు - క‌బడ్డీ క‌బ‌డ్డీ - ధ‌న 51 - దొంగ‌రాముడు అండ్ పార్టీ - ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు.. అదుర్స్‌ - స‌ర‌దాగా కాసేపు వంటి సినిమాల్లో అద్భుత‌మైన ఆహార్యంతో ఆక‌ట్టుకున్నారు. కొండ‌వ‌ల‌స న‌టించిన చిట్ట చివ‌రి సినిమాలు, దేవ‌రాయ‌ - శ్రీ‌వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి. కొండ‌వ‌ల‌స ఇక‌లేరు అన్న నిజాన్ని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ అంత తేలిగ్గా జీర్ణించుకోలేదు. ఓ గొప్ప న‌టుడిని ప‌రిశ్ర‌మ కోల్పోయింది. కొండవ‌ల‌స కుటుంబానికి తుపాకి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తోంది.