Begin typing your search above and press return to search.

40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అలీకి భారీ సన్మానం

By:  Tupaki Desk   |   19 Feb 2019 12:19 PM GMT
40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అలీకి భారీ సన్మానం
X
కమెడియన్ అలీకి టాలీవుడ్ సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. పాత జెనరేషన్ సూపర్ స్టార్ల దగ్గరనుండి మొదలుపెట్టి ఈ జెనరేషన్ సూపర్ స్టార్ల వరకూ అందరి సినిమాలో నటించారు అలీ. స్టార్ హీరోలే కాదు.. ఫలానా హీరోతో అలీ నటించలేదని చెప్పడం చాలా కష్టం. కమెడియన్ గానే కాకుండా హీరోగానూ ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు ఆయన. అలీ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి నలభై ఏళ్ళు అవుతోంది. త్వరలో ఈ నలభై ఏళ్ళ సెలబ్రేషన్లు జరగనున్నాయి.

అలీ బాల నటుడిగా 'ప్రెసిడెంట్ పేరమ్మ' చిత్రం ద్వారా 1979 లో తన సినీ ప్రయాణం ప్రారంభించారు. 80 లలో విడుదలైన 'చంటబ్బాయ్'.. 'సీతాకోకచిలుక' లాంటి సూపర్ హిట్ సినిమాలతో అలీకి వెనక్కు తిరిగిచూసుకునే అవసరం లేకుండా పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎన్నో వందల చిత్రాలలో నటించారు అలీ. 'ఎన్న పరంద ఎన్న చాట' లాంటి అలీ ట్రేడ్ మార్క్ డైలాగులు తెలుగు భాషలలో భాగంగా మారిపోయాయి. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'యమలీల' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం కూడా సాధించారు అలీ. ఇప్పటి కమెడియన్ల లాగా హీరోగా గిరిగీసుకుని తన కెరీర్ పాడు చేసుకోకుండా హీరోగా చేసినా కమెడియన్ రోల్స్ కూడా చేస్తూ తన కరీర్ ను కొనసాగించారు. ఇప్పటివరకూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడిగానే కాకుండా టీవీ హోస్టుగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

అలీ నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం వేడుకను ఫిబ్రవరి 23 న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. సంగమం ఫౌండేషన్ అలీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 23న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని సమాచారం. ఈ కార్యక్రమానికి ఫిలిం ఇండస్ట్రీ నుండి కే.రాఘవేంద్ర రావు..ఎస్వీ కృష్ణారెడ్డి.. తమ్మారెడ్డి భరద్వాజ.. అశ్విని దత్ అతిథులుగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో అలీని స్వర్ణ కంకణంతో ఘనంగా సత్కరిస్తారట.