Begin typing your search above and press return to search.

కోకిల కర్చీఫ్ వేసిందిగా!

By:  Tupaki Desk   |   22 Aug 2018 2:00 PM IST
కోకిల కర్చీఫ్ వేసిందిగా!
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతమైన పోటీ మధ్య స్ట్రెయిట్ సినిమాలకే మంచి డేట్ దొరకటం కష్టంగా ఉంది. అందుకే క్లాష్ తప్పదని తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాయి. దానికి ఉదాహరణగా ఎల్లుండి 24తేదీనే చెప్పుకోవచ్చు. ఇక ఈ నెల 30న పక్కా అని డేట్ రెండు వారాల క్రితమే లాక్ చేసుకున్న శైలజారెడ్డి అల్లుడు అనూహ్యంగా పోస్ట్ పోన్ కావడంతో ఆ అవకాశం వాడుకోవడం కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. చేతిలో తక్కువ టైం ఉంది కాబట్టి ప్రమోషన్ చేయగలమా లేదా అనే అనుమానంతో పేపర్ బాయ్ నిర్మాత సంపత్ నంది ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నట్టు టాక్. నిజానికి శైలజారెడ్డి అల్లుడుని దృష్టిలో పెట్టుకునే ఇది ముందు సెప్టెంబర్ 7 అనౌన్స్ చేసారు. చైతు లాంటి స్టేచర్ ఉన్న హీరో మూవీ కాబట్టి ఎందుకు రిస్క్ అని శైలజారెడ్డి అల్లుడు డేట్ ప్రకటించిన టైంలో మిగిలిన నిర్మాతలు 31మీద ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పుడు అనుకోకుండా ఇది ఖాళీ అయ్యింది. ఏది వస్తుంది అనుకునే లోపే కోకోకోకిల కర్చీఫ్ వేసేసింది.

నయనతార ప్రధాన పాత్రలో డ్రగ్స్ మాఫియా నడిపే కుటుంబాన్ని నేపధ్యంగా తీసుకున్న ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ గత వారమే తమిళ్ లో విడుదలై అక్కడ ఆదరణ దక్కించుకుంది. నయన్ కు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. తెలుగు వెర్షన్ కూడా అదే తేదీ అనుకున్నారు కానీ పోటీతో పాటు థియేటర్ల కొరత వల్ల డ్రాప్ అయ్యారు. ఇప్పుడు చైతు సినిమా 31న లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా కోకోకోకిల నిర్మాతలు పోస్టర్లు విడుదల చేసారు. మరో రెండు చిన్న సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టు సమాచారం. దానికి ఒక రోజు ముందే నాగ శౌర్య @నర్తనశాల వస్తున్నప్పటికీ తట్టుకోదగ్గ పోటీగానే భావిస్తూ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఇది మిస్ చేసుకుంటే మళ్ళి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7తో మొదలై ప్రతి వారం చెప్పుకోదగ్గ సినిమాల విడుదలలు చాలానే ఉన్నాయి. దసరా అయ్యే దాకా గ్యాప్ ఉండదు. అందుకే కోకోకోకిల నిర్మాతలు చాలా తెలివిగా లాక్ చేసుకున్నారు. మరి తనతో పోటీ పడేందుకు ఇంకెవరు వస్తారో ఈ రోజు లేదా రేపు తేలిపోతుంది.