Begin typing your search above and press return to search.

కృష్ణంరాజు అంత్య‌క్రియ‌ల‌పై కుటుంబీకుల క్లారిటీ

By:  Tupaki Desk   |   11 Sep 2022 6:17 AM GMT
కృష్ణంరాజు అంత్య‌క్రియ‌ల‌పై కుటుంబీకుల క్లారిటీ
X
ప్రముఖ నటుడు.. నిర్మాత‌ యువి కృష్ణంరాజు (83) ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ నేటి తెల్ల‌వారు ఝామున‌ 3.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అత‌డి మృతి టాలీవుడ్ లో తీవ్ర విషాదం నింపింది. సినీరాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు ఇప్ప‌టికే సంతాపం వ్యక్తం చేసారు. కృష్ణంరాజు మృతికి మూవీ ఆర్టిస్టుల సంఘం ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేసింది.

తాజా స‌మాచారం మేర‌కు.. కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు సోమ‌వారం మధ్యాహ్నం హైద‌రాబాద్ మ‌హాప్ర‌స్థానంలో జ‌రుగుతాయి. ఈ మ‌ధ్యాహ్నం 12:00 గంటల తర్వాత అతని నివాసానికి తీసుకురానున్నారు. అనంత‌రం ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద అభిమానుల కోసం పార్థీవ దేహాన్ని ఉంచుతార‌ని తెలుస్తోంది. అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబీకులు వెల్ల‌డించారు. ఈ విషాద వార్తతో ప్రభాస్-కృష్ణం రాజు అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

నెల‌రోజులుగా ఆస్ప‌త్రిలోనే...

రాధే శ్యామ్ విడుద‌ల స‌మ‌యంలో కృష్ణంరాజు తీవ్ర అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్ప‌టికే వ‌య‌సు సంబంధిత స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. లివ‌ర్ - ఊపిరితిత్తుల సంబంధ స‌మ‌స్య‌లు తీవ్ర‌త‌రం అయ్యాయి. ఏడాది కింద‌ట ఆయ‌న ఓసారి అదుపుత‌ప్పి కింద‌ప‌డ‌డంతో గాయ‌మైంది. త‌న కాలి వేలిని కూడా డాక్ట‌ర్లు శ‌స్త్ర‌చికిత్స‌తో తొల‌గించారు. ఆ త‌ర్వాత ఆయ‌న వీల్ ఛైర్ సాయం తీసుకున్నారు.

కోవిడ్ రెండుసార్లు ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టింది. నెల రోజుల క్రితం ఆయ‌న‌కు రెండోసారి కొవిడ్ సోకగా చికిత్స‌తో కోలుకున్నారు. కానీ పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌లు ఆయ‌న‌ను వెన్నాడాయి. ఊపిరితిత్తుల్లో న్యూమోనియా.. లివ‌ర్ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గ‌లేదు. ఇటీవ‌ల‌ నెల‌రోజుల పాటు ఆస్ప‌త్రికే ఆయ‌న అంకిత‌మ‌య్యారు. ఆయ‌న‌కు కృత్రిమంగా ఆక్సిజ‌న్ ని అందించారు. చికిత్స కొన‌సాగుతుండ‌గానే.. నేటి తెల్ల‌వారుఝామున 3 గంట‌ల‌కు ఆయ‌న తుది శ్వాస విడిచారు.