Begin typing your search above and press return to search.

బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన తెలుగు 'సినిమా బండి'

By:  Tupaki Desk   |   1 May 2021 8:30 AM GMT
బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన తెలుగు సినిమా బండి
X
'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మేకర్స్ రాజ్ & డీకే రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ ''సినిమా బండి''. మే 14న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంటోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ తెలుగు సినిమా కంటెంట్ ని ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఏకంగా ఈ ట్రైలర్ ని ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నాడు. రాజ్ & డీకే కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా 'సినిమా బండి' అక్కడి వారిని ఆకర్షిస్తున్నట్లు అర్థం అవుతోంది. టాలీవుడ్ లో వైజయంతీ మూవీస్ వంటి నిర్మాణ సంస్థలు - తరుణ్ భాస్కర్ వంటి దర్శకులు ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

ఓటీటీలు వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ కు ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు 'సినిమా బండి' కి దక్కుతున్న ప్రశంసలు చూస్తుంటే ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా అనిపిస్తోంది. ప్రవీణ్ కందిరేగుల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వసంత్ మరింగంటి రచనా సహకారం అందించాడు. ఆటోలో దొరికిన ఖరీదైన డిజిటల్ కెమెరాను ఉపయోగించి తన గ్రామస్థులతో కలిసి ఓ ఆటో డ్రైవర్ సినిమా ఎలా తీసాడనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. అమాయకపు మనస్తత్వాలు కలిగిన కొందరు వ్యక్తులు సినిమా తీయడానికి, నిజాయితీగా చేసే ప్రయత్నాలు ఆహ్లాదకరంగా సహజంగానూ 'సినిమా బండి' లో చూపించబోతున్నారు. మరో రెండు వారాల్లో ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.