Begin typing your search above and press return to search.

సినిమాటోగ్రఫీ చట్టం: కేంద్రంతో సినీ ఇండస్ట్రీ ఫైట్

By:  Tupaki Desk   |   7 July 2021 3:03 PM IST
సినిమాటోగ్రఫీ చట్టం: కేంద్రంతో సినీ ఇండస్ట్రీ ఫైట్
X
కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై కోలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం దీన్ని వ్యతిరేకించారు. సినిమాటోగ్రఫీ చట్టానికి కేంద్రం సవరణలు చేయాలని నిర్ణయించడాన్ని తమిళనాడు సీఎం ఖండించారు. ఇది ప్రజాస్వామ్యం సృజనాత్మకతకు, కళాత్మక స్వేచ్ఛకు తగినంత చోటు కేటాయించాలి అని ఆయన కేంద్రానికి లేఖ రాశారు.

కేంద్రం నిర్ణయం పూర్తిగా అన్యాయమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు రాసిన లేఖలో సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు దశాబ్ధాల క్రితం వ్యతిరేకించిన ఈ నిర్ణయాన్ని కేంద్రం అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు.ఇక ఇప్పటికే కేంద్రం తెచ్చిన ఈ సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై కోలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణ సినిమా వాళ్ల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందని ఆరోపిస్తున్నారు.

కోలీవుడ్ ప్రముఖులు కమల్ హాసన్, సూర్య, విశాల్ సహా అందరు హీరోలు తాజాగా గళమెత్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో నిరసన తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం సినిమా వాళ్ల గొంతు నొక్కేయడమేనని నిరసన తెలిపారు.

-ఏంటీ చట్టం.. వివాదం ఎందుకు?
కేంద్రప్రభుత్వం జూన్ 18న సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. 1952 నాటి ఈ చట్టానికి మార్పులు చేసి గత ఏడాది ఫిబ్రవరి 12న రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఆ తర్వాత లోక్ సభ ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఒక సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సెన్సార్ చేసి సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత ఎవరైనా ఈ సినిమాపై ఫిర్యాదు చేస్తే కేంద్రం మళ్లీ సెన్సార్ చేయమని కోరే అధికారం కలిగి ఉంటుంది. దీంతో ఇప్పటివరకు స్వతంత్ర వ్యవస్థగా ఉన్న సెన్సార్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం పెరుగుతుందనే ఆరోపణలున్నాయి.

అంతేకాదు సినిమాలోని సన్నివేశాలు లేదా స్టోరీని కాపీ కొట్టినట్టు తేలితే జైలు శిక్షతోపాటు జరిమానా విధించవచ్చు. ఇలాంటి నిబంధనలు ఈ కొత్త చట్టంతో అమల్లోకి రావడంపై సినీ ఇండస్ట్రీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ చట్టంపై బాలీవుడ్ పోరుబాట పట్టింది. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ కశ్యప్, ఫర్హాన్ అక్తర్, నందితా దాస్, ప్రకాష్ రాజ్, సహా 1400 మంది ఈ చట్టంపై తమ నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రానికి ఘాటు లేఖ రాశారు. సెన్సార్ చేసిన తర్వాత మళ్లీ సెన్సార్ చేయాలనే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండటం వాక్ స్వాతంత్య్రాన్ని హరించేది వారన్నారు.అయితే ఈ అభ్యంతరాలపై కేంద్రం మాత్రం ఈ కొత్త చట్టంతో దొంగతనంగా సినిమాలు రిలీజ్ చేయకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు. పైరసీ చేసినవాళ్లను చట్ట ప్రకారం శిక్షించవచ్చని చెప్పుకొచ్చారు.

అయితే మెజార్టీ సభ్యులు మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనన్నలు అందుకుంటున్న భారత దేశంలో వాక్ స్వాతంత్రపు హక్కు హరించేలా ఈ చట్టం ఉందని అంటున్నారు. ఈ సవరణలు కోర్టు తీర్పులకు వ్యతిరేకం అంటున్నారు. ఈ చట్టాన్ని వీలైనంత తొందరగా ఉపసంహరించుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొందరు సినీ ప్రముఖులు మాత్రం కేంద్రం తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ చట్టం నిర్మాతలు, హీరోలు, చిత్ర పరిశ్రమను ఆదుకునేలా ఉందని కితాబు ఇస్తున్నారు.