Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బ....సినీ ఇండస్ట్రీ అబ్బా...!

By:  Tupaki Desk   |   18 March 2020 2:30 AM GMT
కరోనా దెబ్బ....సినీ ఇండస్ట్రీ అబ్బా...!
X
కరోనా ఎఫెక్ట్ జనాలపైనే కాక సినిమాలపై కూడా పడిందనే విషయం అందరికి తెలిసిందే. కరోనా దెబ్బతో దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలతో పాటు మల్టీఫ్లెక్స్, సినిమా థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ మన దేశ సినీ ఇండస్ట్రీ మీద మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఇండస్ట్రీల మీద కూడా పడింది.

ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ వైరస్ ప్రభావం సమ్మర్ సీజన్ మొత్తం ఉండే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ పరిశ్రమపై కొన్ని వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదముందనే హెచ్చరికల నేపథ్యంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆందోళన చెందుతున్నది. అత్యధిక జన సంచార ప్రాంతాలైన మాల్స్,హోటల్స్, సినిమా థియేటర్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇదిలాగే కొనసాగితే సౌత్ సినిమా ఇండస్ట్రీకి భారీగా నష్టం వాటిల్లుతుందని పలువురు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతం లో అప్పుడప్పుడు ప్రకృతి విపత్తుల వల్ల నష్టం వాటిల్లినప్పటికీ ఇంతటి ప్రభావం గతంలో ఎప్పుడూ సినీ పరిశ్రమ చవిచూడలేదని తెలిపారు.

సినిమాల విడుదల వాయిదా పడితే ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. చిన్న సినిమాలు పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు ఆగిపోవడం నిర్మాతలకు తలనొప్పిగా మారే అవకాశముందన్నారు. సాధారణంగా సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ వేసవిలో కూడా కొన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా ప్రభావం వల్ల ఇప్పుడు రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తర్వాతి రోజుల్లో ఈ సినిమాలన్నీ వరుసగా విడుదలైతే ఒక సినిమా మరో సినిమాకు పోటీగా మారి కలెక్షన్లపై దెబ్బ పడే అవకాశం ఉందని పలువురు సినీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.

మహమ్మారి కరోనా ఎఫెక్ట్ దక్షిణాది సినిమా పరిశ్రమపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికిప్పుడు అంచనా వేసినా సుమారు రూ.2 వేల కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత తెలియజేసారు. టాలీవుడ్ లో ఈ నష్ట ప్రభావం సమ్మర్ మొత్తానికి దాదాపు రూ.500 కోట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.