Begin typing your search above and press return to search.

దేవరకొండకి అండగా ఉంటానంటున్న మెగాస్టార్...!

By:  Tupaki Desk   |   5 May 2020 1:00 PM IST
దేవరకొండకి అండగా ఉంటానంటున్న మెగాస్టార్...!
X
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న మిడిల్ క్లాస్ కుటుంబాలకు అండగా ఓ ప్రోగ్రామ్‌ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన 25 లక్షల విరాళం ఇవ్వడమే కాకుండా సొంతంగా తన వాలంటీర్లతో అవసరమున్న వారికి నిత్యావసర సరుకుల్నీ అందజేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా చేయూతనీయదల్చిన వారు నేరుగా డోనేషన్ కూడా ఇవ్వచ్చని వివరించాడు విజయ్. రోజు ఎన్నికుంటుబాలకు సరుకుల్నీ అందిస్తున్నాడో.. దానికి ఎంత ఖర్చు అవుతుందో, డోనేషన్స్ ఎంతోచ్చాయో మొదలగు అంశాలకు సంబందించిన ఓ బులెటెన్‌ను విడుదల చేస్తున్నాడు. అయితే ఇదంతా నచ్చని కొంత మంది తనను టార్గెట్ చేసుకుని మీడియాలో తనపై కక్షపూరితంగా రాస్తున్న కొన్ని వెబ్‌ సైట్లపై మండిపడ్డారు. ఓ మూడు నాలుగు వెబ్‌సైట్లు కావాలనే తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. వాళ్ల తప్పుడు రాతల్ని తనపై రుద్దుతున్నారని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. అసలు మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ ఫైర్ అయ్యాడు.

గత కొద్దికాలంగా తనను టార్గెట్ చేసినా పట్టించుకోలేదని.. కరోనా సంక్షోభం సమయంలో ఉద్దేశపూర్వంగా తప్పుడు రాయడంతో స్పందించాల్సి వస్తున్నదని.. అందుకే ఈ సమయంలో వీడియో ద్వారా వారి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని.. ప్రజలకు నిజాలేంటో చెప్పాలని ప్రయత్నిస్తున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. ఇప్పుడు చిత్ర‌సీమంతా విజ‌య్ దేవ‌ర‌కొండ వెనుక నిల‌బ‌డింది. 'కిల్ ఫేక్ న్యూస్‌' పేరిట‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టాలీవుడ్ ని ఏకం చేస్తున్నాయి. హీరోలంతా ముక్త కంఠంతా 'కిల్ ఫేక్ న్యూస్‌' అని నిన‌దిస్తున్నారు. #KillFakeNews #KillGossipWebsites #SpreadPositivity అనే హ్యాష్ టాగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ఓ ట్వీట్ చేసి విజ‌య్ దేవరకొండకి సంఘీభావం వ్య‌క్తం చేశాడు. అప్ప‌టి నుంచీ విజ‌య్ కి మ‌ద్ద‌తు పెరుగూనే ఉంది. రవితేజ, అనిల్ రావిపూడి, అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, కొరటాల శివ, రానా దగ్గుబాటి, క్రిష్, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్ మొదలగువారు తమ ట్వీట్స్‌ తో సోషల్ మీడియా వేదికగా 'కిల్ ఫేక్ న్యూస్' అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం విజ‌య్ వెనుక నిల‌బ‌డ్డాడు.

''డియ‌ర్ విజ‌య్‌.. మీ ఆవేద‌న నేను అర్థం చేసుకోగ‌ల‌ను. బాధ్య‌త లేని రాత‌ల వ‌ల్ల నేనూ, నా కుటుంబం బాధ ప‌డిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి'' అంటూ త‌న సంఘీభావం వ్య‌క్తం చేశాడు చిరు. అభిప్రాయాల్ని వార్త‌లుగా ప్ర‌చురించ‌వ‌ద్ద‌ని జ‌ర్న‌లిస్టుల‌కు హిత‌వు ప‌లికాడు చిరంజీవి. సీసీసీ ద్వారా చిరంజీవి విరాళాలు సేక‌రించి.. కార్మికుల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందించే కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కూడా స‌ద‌రు వెబ్ సైట్ విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేసింది. ఇప్పుడు చిరు వ్యాఖ్య‌లు ఆ వార్త‌ల‌కు సైతం స‌మాధానంగా నిలిచాయి. చిరంజీవికి ముందు మెగా బ్రదర్ నాగబాబు సైతం దేవరకొండకు సపోర్ట్ చేశారు. ట్వీట్ చేస్తూ.. 'హాయ్ విజయ్.. నేను నీకు బలంగా మద్దతిస్తున్నాను.. సినిమా పరిశ్రమ రక్తాన్ని పీల్చే కొన్ని వెబ్‌ సైట్లపై పోరాటం చేయడం అనేది.. వాటిపై స్పందించడమనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. నువ్వు స్పందించినందుకు థ్యాంక్స్.. టైమ్ టు టేక్ యాక్షన్ మై బాయ్' అని పేర్కొన్నాడు. మరి రాబోయే రోజుల్లో ఇది సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.