Begin typing your search above and press return to search.

'చోర్ బజార్' ట్రైలర్: మాస్ మంత్రాన్ని జపిస్తున్న పూరీ తనయుడు..!

By:  Tupaki Desk   |   9 Jun 2022 10:39 AM GMT
చోర్ బజార్ ట్రైలర్: మాస్ మంత్రాన్ని జపిస్తున్న పూరీ తనయుడు..!
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నిలదొక్కుకోడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. 'మెహబూబా' సినిమాతో హీరోగా లాంచ్ అయిన ఆకాష్.. డెబ్యూ మూవీతో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో గతేడాది దీపావళికి 'రొమాంటిక్' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు ''చోర్ బజార్'' అనే తన మూడో మూవీతో అలరించడానికి రెడీ అవుతున్నాడు.

విభిన్నమైన కథా కథనాలతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'చోర్ బజార్' సినిమా రూపొందుతోందని చిత్ర బృందం తెలిపింది. 'దళం' 'జార్జ్ రెడ్డి' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బి. జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆకాశ్ సరసన గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తోంది.

'చోర్ బజార్' నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు గురువారం మేకర్స్ ఆవిష్కరించారు. ఇందులో బచ్చన్ సాబ్ అనే మెకానిక్ గా.. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఆకాష్ కనిపిస్తున్నాడు. గెహన ఒక మూగమ్మాయిగా నటించింది.

'నా పేరు బచ్చన్.. బచ్చన్ సాబ్.. ఈ దునియాలో ప్రతీ వాడికి ఏదొక దూల ఉంటది.. నాకు నా చెయ్యి దూల..' అని ఆకాష్ తన గురించి తాను చెప్పుకోవడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 20 నిముషాల్లో 30 టైర్లు విప్పి తన ప్రేయసి కోసం గిన్నిస్ బుక్ లో ఎక్కాలని చెబుతున్నాడు.

అయితే ఈ సినిమా కథంతా ఓ డైమండ్ చుట్టూ ముడిపడి ఉంటుందని ట్రైలర్ ని బట్టి అర్థం అవుతుంది. ఇందులో ప్రేమ కథతో పాటుగా యాక్షన్ పాళ్లు కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి. ఈ సినిమాతో 'లేడీస్ టైలర్' ఫేమ్ అర్చన చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించింది. ఆమె హీరో తల్లి పాత్ర పోషించింది.

సునీల్ - సుబ్బరాజు - పోసాని కృష్ణమురళి - సంపూర్ణేష్ బాబు - ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. బచ్చన్ సాబ్ లవ్ స్టొరీ సంగతేంటి? డైమండ్ గోల ఏంటి? దాని వెనకున్న అసలు కథేంటి? చోర్ బజార్ టైటిల్ కు జస్టిఫికేషన్ ఏంటి? జీవన్ రెడ్డి ఈసారి ఎలాంటి పాయింట్ ను చెప్పబోతున్నారు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

'రొమాంటిక్' తర్వాత పూరీ ఆకాష్ మరోసారి మాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. సత్య గిడుటూరి ఎడిటింగ్ వర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

'చోర్ బజార్' చిత్రాన్ని ఐ. వి ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. అల్లూరి సురేష్ వర్మ సహ నిర్మాతగా ఉన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.