Begin typing your search above and press return to search.

వాల్తేరుతో వీళ్ల‌కు ఊపొచ్చిన‌ట్టుందే!

By:  Tupaki Desk   |   18 Jan 2023 7:30 AM GMT
వాల్తేరుతో వీళ్ల‌కు ఊపొచ్చిన‌ట్టుందే!
X
ఒక హీరోకు భారీ స‌క్సెస్ ప‌డిందంటే త‌రువాత వ‌స్తున్న సినిమాకు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టే. ఈ హిట్ ని బ‌ట్టి బిజినెస్ ప‌రంగానూ త‌రువాత సినిమాకు భారీ క్రేజ్ ఏర్ప‌డుతూ వుంటుంది. ఓ విధంగా చెప్పాలంటే ఓ హిట్ త‌రువాత వ‌చ్చే సినిమా, దానికి సంబంధించిన మేక‌ర్స్ జాక్ పాట్ కొట్టిన‌ట్టే. ఇప్పుడు ఇదే ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు 'భోళా శంక‌ర్‌' నిర్మాత అనిల్ సుంక‌ర‌, ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌. వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి.. మాస్ మ‌హారాజా ర‌వితేజ చాలా ఏళ్ల విరామం త‌రువాత క‌లిసి న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌'.

బాబి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ విజ‌య దుందుభి మోగిస్తోంది. సినిమాకు ముందు రోజు కొంత నెగిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మాస్ ఆడియ‌న్స్ కి న‌చ్చే అంశాలు, ఎలివేష‌న్ లు పుష్క‌లంగా వుండ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ రోజు రోజుకీ పుంజుకుంటూ భారీ వ‌సూళ్ల దిశ‌గా ప‌య‌నిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డ‌మే కాకుండా 108 కోట్లు రాబ‌ట్టింది.

'ఆచార్య‌' ఫ‌లితంతో నీర‌సించిపోయిన అభిమానుల‌కు 'వాల్తేరు వీర‌య్య‌'తో చిరు పూన‌కాలు తెప్పించారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ మూవీ ఓవ‌ర్సీస్ లోనే అదే హ‌వాని కొనాగిస్తూ 2 మిలియ‌న్ ని దాదాపుగా క్రాస్ చేయ‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 1.9 మిలియ‌న్ మార్కుని చేరుకున్న ఈ మూవీ 2 మిలియ‌న్ మార్కుని దాట‌బోతోంది. తాజా గ‌ణాంకాల లెక్క‌ల ప్ర‌కారం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో, ఓవ‌ర్సీస్ లో.. వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ ల రేసులో 'వీర సింహారెడ్డి'ని 'వాల్తేరు వీర‌య్య‌' అధిగ‌మించేసింది.

రానున్న రోజుల్లో వ‌సూళ్లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే 'వాల్తేరు వీర‌య్య‌' ఫ‌లితంతో 'భోళా శంక‌ర్' టీమ్ కు ఊపొచ్చిన‌ట్టుంది. ఈ మూవీ త‌రువాత చిరంజీవి న‌టిస్తున్న ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'భోళా శంక‌ర్‌'. త‌మిళ హాట్ ఫిల్మ్ 'వేదాలం' ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. చిరుకు సోద‌రిగా కీర్తి సురేష్ న‌టిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ త‌మ‌న్నా న‌టిస్తోంది.

ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ ని జ‌న‌వ‌రి 17న ప్రారంభించారు. కోల్ క‌తా కాళీ సెట్ లో ఈ మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. 'వాల్తేరు వీర‌య్య‌' అందించిన స‌క్సెస్ జోష్ లో వున్న ఈ చిత్ర బృందం ఆ స‌క్సెస్ ని 'భోళా శంక‌ర్‌' కూడా కంటిన్యూ చేస్తుంద‌నే ఆత్మ విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ కి సంబంధించిన అప్ డేట్ ని అందిస్తూ ప‌లు ఫొటోల‌ని ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌, నిర్మాత అనిల్ సుంక‌ర సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. 'వాల్తేరు వీర‌య్య‌' స‌క్సెస్ వైబ్ ని కంటిన్యూ చేస్తామంటూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.