Begin typing your search above and press return to search.

మెగాస్టార్ బయోపిక్ రాబోతోందా...?

By:  Tupaki Desk   |   17 April 2020 5:00 AM IST
మెగాస్టార్ బయోపిక్ రాబోతోందా...?
X
ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీల్లో కూడా బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్ర‌తీ ద‌ర్శ‌కుడు బ‌యోపిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రముఖులందరి జీవితాల‌ను తెర‌కెక్కించే బాధ్య‌త తీసుకుంటున్నారు ద‌ర్శ‌కులు. ఇప్పటి దాకా వచ్చిన అన్ని బయోపిక్ లు దాదాపు సక్సెస్ అయినవే. బాలీవుడ్ లో డర్టీ పిక్చర్, ఎమ్మెస్ ధోని, సంజు, దంగల్, మేరీ కామ్, నీర్జా, సూపర్ 30, చపక్, భాగ్ మిల్కా భాగ్, థాకరే లాంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక తెలుగులో ఇప్ప‌టికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ వ‌చ్చాయి. టాలీవుడ్ లో బ‌యోపిక్‌ల శ‌కానికి 'మ‌హాన‌టి' చిత్రం నాందిప‌లికిందని చెప్పవచ్చు. అలనాటి నటి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన 'మహానటి' సంల‌చ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. వైస్సార్ బయోపిక్ 'యాత్ర' కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత తెర‌పైకొచ్చిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. 'ఎన్టీఆర్ కధానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' అని రెండు భాగాలుగా తెరకెక్కిన నందమూరి తారక రామారావు బయోపిక్ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. వీటితో పాటు సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్ బియోపిక్స్ రాబోతున్నాయి. ఇదే క్ర‌మంలో త్వరలో చిరంజీవి బ‌యోపిక్ కూడా వస్తుందనే అనే వార్త‌లు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి.

అప్పట్లో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ 'అన్నయ్య జీవితం అందరికీ ఆదర్శంగానే ఉంటుంది.. కానీ ఆయన జీవితంలో బయోపిక్ చేయాల్సినన్ని అంశాలు మాత్రం లేవని' చెప్పాడట. లేటెస్టుగా మెగాస్టర్ చిరంజీవి కూడా ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారట. 'తన జీవితంలో బయోపిక్ చేసేంత ఎమోషన్స్ లేవని' అన్నాడని సమాచారం. అంతేకాకుండా 'ఎలాంటి ఒడిదుడుకులు లేని నా జీవితాన్ని బయోపిక్‌గా తీస్తే పెద్దగా డ్రామా పండదు' అని చిరు చెప్పుకొచ్చారట. వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అగుపెట్టి స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగిన చిరంజీవి జీవితం అందరికి ఆదర్శమనే చెప్పాలి. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. శివశంకర్ వర ప్రసాద్ నుండి మెగాస్టార్ చిరంజీవిగా రూపాంతరం చెందడానికి ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు నేటి తరం నటీనటులు ఆదర్శంగా తీసుకొంటుంటారు. నేటి స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోల్లో చాలా మంది మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మెగాస్టార్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని బయోపిక్ తీస్తే బాగుంటుందని సినీ అభిమానులు కూడా ఆశ పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో మెగాస్టార్ బయోపిక్ కి బాటలు పడతాయేమో చూడాలి.