Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల అత్యవసర సమావేశం...?

By:  Tupaki Desk   |   20 May 2020 1:30 PM GMT
మెగాస్టార్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల అత్యవసర సమావేశం...?
X
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కనీవిని ఎరగని క్రైసిస్ ఎదుర్కుంటోంది. ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని సినీ ఇండస్ట్రీ అతలాకుతలం అయింది. సినీ చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం కష్టంగా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీకి కొన్ని కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇది ఇంకా ఇలానే కొనసాగితే నష్ట తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కానీ సినిమా రంగం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సినిమా పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు.

షూటింగ్ లకు అనుమతి లభిస్తుందా.. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి.. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి.. ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్ కి అనుమతి ఇవ్వకపోతే ఏమి చేయాలి.. ఒకవేళ ప్రభుత్వం సినిమా రంగం మీద అనుమతి ఇస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు దీనిపై పలు దపాలు చర్చలు జరిపారు. కానీ ఏ విషయం ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఈ మధ్య ఇండస్ట్రీ పెద్దగా అన్ని విషయాల్లో బాధ్యత తీసుకొని ముందుండి నడిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో కూడా లీడ్ తీసుకోబోతున్నాడని సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమని గాడిలో పెట్టడం కోసం తీసుకోవలసిన నిర్ణయాల గురించి చర్చించడానికి చిరంజీవి అధ్యక్షతన ఇండస్ట్రీ ప్రముఖులు సమావేశం కాబోతున్నారట. ఈ మీటింగ్ లో డిస్కస్ చేసిన విషయాలను బట్టి తదుపరి కార్యాచరణ నిర్ణయించాలని డిసైడ్ అయ్యారట.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సినిమా షూటింగుల విషయంలో సానుకూలంగా స్పందించగా తెలంగాణాలో మాత్రం ఇప్పట్లో షూటింగ్స్ కష్టమే అన్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీనిపై కూడా ఇండస్ట్రీ ప్రముఖులు డిస్కస్ చేసి తగిన జాగ్రత్తలతో షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతివ్వమని తెలంగాణా ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంది. అంతేకాకుండా నిర్మాతలను నష్టాల ఊబిలో నుంచి బయటపడేయడానికి సినిమా బడ్జెట్ కోతలు.. రెమ్యూనరేషన్ తగ్గింపు విషయాలు కూడా చర్చకు రావొచ్చు. దీంతో పాటు థియేటర్స్ రీ ఓపెనింగ్ గురించి.. సినిమాల ఓటీటీ రిలీజుల గురించి.. సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవడం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ మీటింగ్ కి టాలీవుడ్ ప్రముఖులకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ మీటింగ్ తో సినీ ఇండస్ట్రీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.