Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ లో చిరు ఏం నేర్చుకుంటున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   21 April 2020 1:30 AM GMT
లాక్‌ డౌన్‌ లో చిరు ఏం నేర్చుకుంటున్నారో తెలుసా?
X
కరోనా లాక్‌ డౌన్‌ వల్ల దేశ వ్యాప్తంగా జనజీవనం స్థంభించింది. సెలబ్రెటీలు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ఎప్పుడు బిజీగా గడిపే ప్రముఖులు ఇప్పుడు ఏ పని లేకుండా ఉన్నారు. అయితే కొందరు ఈ ఫ్రీ టైంను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరేమో కాని మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం ఈ లాక్‌ డౌన్‌ టైంను ఫుల్‌ గా వాడేసుకుంటున్నారు. ఈ లాక్‌ డౌన్‌ టైం లోనే చిరంజీవి సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో ఆయన ఎంత యాక్టివ్‌ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కరోనా కారణంగా సినీ కార్మికులు పడుతున్న ఆకలి బాధలను తీర్చేందుకు కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చేందుకు తమవంతు సాయంను అందిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయన స్పానిష్‌ భాషను కూడా నేర్చుకుంటున్నారట. తన పిల్లల పిల్లలు(మనవళ్లు.. మనవరాళ్లు) ఈ టైంలో పలు భాషలు నేర్చుకుంటున్న కారణంగా వారితో పాటు తాను కూడా స్పానిష్‌ భాషను ఆన్‌ లైన్‌ ద్వారా నేర్చుకుంటున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు.

లాక్‌ డౌన్‌ టైంను వృదా చేయవద్దంటూ మొదటి నుండి పలువురు ప్రముఖులు సూచనలు చేస్తున్నారు. చాలా మంది ఆన్‌ లైన్‌ లో కోర్సులు నేర్చుకోవడంతో పాటు కొందరు వంటల్లో మరికొందరు ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ పై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి స్పానిష్‌ ల్యాంగేజ్‌ ను నేర్చుకునే విషయమై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ పూర్తి అయ్యేప్పటికి చిరంజీవి పూర్తిగా స్పానిష్‌ మాట్లాడుతారేమో చూడాలి.