Begin typing your search above and press return to search.

మాఫీయా డాన్ గా మెగాస్టార్!

By:  Tupaki Desk   |   21 Feb 2022 9:06 AM GMT
మాఫీయా డాన్ గా మెగాస్టార్!
X
సీనియర్ స్టార్ హీరోల్లో చిరంజీవి ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రమైన 'ఆచార్య' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఆయన మూడు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు. ఆ మూడు సినిమాల్లో ఒకటైన 'గాడ్ ఫాదర్' చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళంలో మోహన్ లాల్ స్థాయిని మరింతగా పెంచిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. అందువలన అందరిలోను ఈ సినిమాపై ఆసక్తి ఉంది.

ఇక ఆ తరువాత ఆయన మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్ ' చేస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా తమన్నా అందాల సందడి చేయనుంది. ఇక బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా సెట్స్ పైనే ఉంది. ఈ సినిమాకి 'వాల్తేరు వీర్రాజు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి .. వెంకీ కుడుములకి ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా వెంకీ సత్తాను గురించి చెప్పడానికి 'ఛలో' .. 'భీష్మ' సినిమాలు సరిపోతాయి.

వెంకీ కుడుముల స్క్రిప్ట్ పట్ల చిరంజీవి పూర్తి సంతృప్తి చెందినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించనున్నారు? ఆయనను వెంకీ ఎలా చూపించనున్నాడు? అనేది అందరిలో ఆసక్తిని రేపుతున్న అంశాలు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి 'మాఫియా డాన్' గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా వెంకీ డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. చిరంజీవి లుక్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కామెడీ పాళ్లు ఎంతమాత్రం తగ్గవని చెబుతున్నారు.

ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లోని పెద్ద బ్యానర్లల్లో డీవీవీ ఒకటి. ఇంతకుముందు ఈ బ్యానర్లో పవన్ .. చరణ్ .. బన్నీ చేశారు. ఇక చిరంజీవితో చేస్తున్న ఈ సినిమా విషయంలో ఖర్చుకు వెనుకాడకుండా రంగంలోకి దిగుతున్నారట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. వెంకీ కుడుముల దర్శకుడిగా మూడో సినిమానే చిరంజీవితో చేసే ఛాన్స్ కొట్టడం విశేషం.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ప్రస్తుతం ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.