Begin typing your search above and press return to search.

అంద‌రూ బాహుబ‌లులే అంటే ఎలా?

By:  Tupaki Desk   |   31 March 2018 2:30 AM GMT
అంద‌రూ బాహుబ‌లులే అంటే ఎలా?
X
మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ సినిమాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని, నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడు న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న ‘సైరా’ సినిమా కోసం శారీర‌కంగా కూడా చాలా శ్ర‌మ‌ప‌డ్డాడు చిరూ. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన స్టిల్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ ఫోటోల్లో మెగాస్టార్‌ పొడ‌వాటి జుట్టు పెంచి - గుబురు గ‌డ్డంతో కనిపిస్తున్నాడు. దాంతో చిరు అచ్చం ‘బాహుబ‌లి’ చిత్రంలో ప్ర‌భాస్‌ లా ఉన్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్ర‌భాస్ ‘బాహుబ‌లి’ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఓ సినిమా కోసం యువ హీరో అంత క‌ష్ట‌ప‌డ‌డమంటే - ఒక్క ప్ర‌భాస్ వ‌ల్లే అవుతుందేమో. అయితే వారంద‌రికీ సీనియ‌ర్‌. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇప్ప‌టి కుర్ర హీరోలంద‌రికీ న‌ట‌న‌లో పాఠాలు చెప్పిన మాస్టారు లాంటి వాడు. అలాంటి మెగాస్టార్‌ ను ప్ర‌భాస్‌ తో పోల్చ‌డం స‌రికాదు. అయినా ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఒక‌టుంది. ‘బాహుబ‌లి’ ఓ కాల్ప‌నిక క‌థ‌. ‘సైరా’ వాస్త‌విక క‌థ‌. నిజంగా జ‌రిగిన క‌థ‌. మ‌న చరిత్ర‌. అలాంటి చ‌రిత్ర మీద సినిమా తీసేటప్పుడు క‌చ్చితంగా చాలా ప‌రిశోధ‌న ఉంటుంది. అప్ప‌టి ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా వ‌స్త్ర‌ధార‌ణ ఉండేలా జాగ్ర‌త్తలు తీసుకుంటారు ద‌ర్శ‌కుడు. 18వ శ‌తాబ్దంలో పాలెగాండ్ల వారసుడైన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిని ప్ర‌తిబింబించేలా ఉండాలంటే పొడ‌వైన జుట్టూ, గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించే గ‌డ్డమూ ఉండాలి. అది అవ‌స‌రం కానీ అనుక‌ర‌ణ కాదు.

అయినా ఒక్క ఫోటోను బ‌ట్టి ఇలా పోలీక‌లు తేవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌మంటారు. సినిమా ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉంది. అధికారికంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు కూడా విడుద‌ల కాలేదు. ఇప్పుడే ఇన్ని విమ‌ర్శ‌లూ, పోలిక‌లా... అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు మెగా అభిమానులు.